రోజుల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సొంతింటిని నిర్మించుకునేందుకు రకరకాలుగా శ్రమిస్తుంటారు. ఎంతో మంది ఇంటిని నిర్మించుకునేందుకు బ్యాంకు రుణాలు, ఇతర అప్పుడు చేసి తీవ్రంగా కష్టపడుతుంటారు. దేశంలో సొంతింటిని నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది పేదలు ఇల్లు లేక అద్దె ఇళ్లు, రేకుల షెడ్లు, చెట్ల కిందనే గుడారాలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే సొంత ఇంటిని నిర్మించుకునేందుకు అందరికి కలిసి రాదు. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి తక్కువ వడ్డీ రేట్లల్లోనే బ్యాంకు నుంచి రుణాలు అందించేందు విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. మీడియా నివేదికల ప్రకారం.. సరసమైన గృహ రుణాలకు వడ్డీ రాయితీ పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాబోయే కొద్ది వారాల్లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించవచ్చని పూరీ చెప్పారు.
వచ్చే ఐదేళ్లలో చిన్న పట్టణ గృహాలకు సబ్సిడీ రుణాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.60,000 కోట్లు వెచ్చించే ఆలోచనలో ఉన్నట్లు గతంలో మీడియా కథనాలు తెలిపాయి. ఈ ఏడాది చివరిలో రాష్ట్ర ఎన్నికలు, 2024 మధ్యలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకులు కొన్ని నెలల్లో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు అందించే విధంగా, అది కూడా తక్కువ వడ్డీ రేట్లలో ఉండే విధంగా చర్యలు చేపడుతోంది మోడీ సర్కార్. ఇందు కోసం కొత్త పథకాలను రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
2023 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త పథకం ద్వారా నగరాల్లో అద్దె ఇళ్లలో నివసించే వారికి సరసమైన గృహ రుణాలను అందజేస్తుందని ప్రకటించారు. తమ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువస్తోందని, ఇది నగరాల్లో నివసిస్తున్నప్పటికీ అద్దె ఇళ్లు, మురికివాడలు లేదా అనధికార కాలనీలలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన చెప్పారు.
ఈ పథకం రూ. 9 లక్షల వరకు రుణ మొత్తాలపై 3-6.5 శాతం మధ్య వార్షిక వడ్డీ రాయితీని అందజేస్తుందని నివేదిక పేర్కొంది. ఈ రాయితీ 20 సంవత్సరాల కాలవ్యవధికి తీసుకున్న రూ. 50 లక్షల కంటే తక్కువ గృహ రుణాలపై అందుబాటులో ఉండవచ్చు.
వడ్డీ రాయితీ లబ్ధిదారుల గృహ రుణ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రణాళిక తుది దశకు చేరుకుందని, దీనికి ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం అవసరమని చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి