2035 నాటికి తిరుగులేని శక్తిగా భారత్‌..! ఆ రంగంలో ఏకంగా 300 బిలియన్ డాలర్ల మార్కెట్‌

భారత సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. 2030 నాటికి 120 బిలియన్ డాలర్లు, 2035 నాటికి 300 బిలియన్ డాలర్ల మార్కెట్‌కు చేరుతుంది. AI, ఆటోమోటివ్, డేటా సెంటర్ల వృద్ధి దీనికి కారణం. ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా భారీ పెట్టుబడులు వస్తున్నాయి.

2035 నాటికి తిరుగులేని శక్తిగా భారత్‌..! ఆ రంగంలో ఏకంగా 300 బిలియన్ డాలర్ల మార్కెట్‌
India Semiconductor Industr

Updated on: Mar 19, 2026 | 6:30 AM

భారతదేశ సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తూ, వచ్చే దశాబ్దంలో ప్రపంచ సప్లయ్‌ చైన్‌లో కీలక స్థానాన్ని సంపాదించే దిశగా అడుగులు వేస్తోంది. డెలాయిట్‌ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దేశీయ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరిగి 120 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా, 2035 నాటికి 300 బిలియన్ డాలర్ల స్థాయిని తాకే అవకాశముంది. ప్రస్తుతం 45-50 బిలియన్ డాలర్ల పరిమాణంలో ఉన్న ఈ మార్కెట్ గత మూడు సంవత్సరాలుగా సుమారు 20 శాతం వృద్ధి రేటుతో పెరుగుతోంది. ఈ వృద్ధికి ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడం, ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రానిక్ భాగాల అవసరం పెరగడం, అలాగే డేటా సెంటర్ల విస్తరణ కారణమవుతున్నాయి.

మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, వాహనాలు, డేటా సెంటర్లు కలిసి 2035 నాటికి మొత్తం సెమీకండక్టర్ డిమాండ్‌లో 70 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంటాయని అంచనా వేయబడింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ (ISM) ఈ రంగానికి గట్టి ఊతమిస్తోంది. ఈ మిషన్ ద్వారా ఇప్పటికే 19 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించబడ్డాయి. అదనంగా 18 నుండి 20 ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతుండగా, వచ్చే ఐదేళ్లలో మరో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. 2030 నుండి 2035 మధ్య మరింతగా 75 నుండి 80 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

ఈ పెట్టుబడులతో దేశీయ తయారీ సామర్థ్యం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 2035 నాటికి భారతదేశం తన సెమీకండక్టర్ అవసరాల్లో 60 శాతం వరకు దేశీయంగానే ఉత్పత్తి చేయగలదని అంచనా. దీనికి అనుగుణంగా 4-5 సిలికాన్ ఫ్యాబ్‌లు, 8-10 కాంపౌండ్ ఫ్యాబ్‌లు, 1-2 డిస్‌ప్లే యూనిట్లు, అలాగే 20-25 అసెంబ్లీ, టెస్టింగ్ కేంద్రాలు ఏర్పడనున్నాయి. సెమీకండక్టర్ రంగం విస్తరణతో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగనున్నాయి. 2035 నాటికి ఈ పరిశ్రమ సుమారు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం కలిగి ఉందని అంచనా. అయితే ఈ వృద్ధి స్థిరంగా కొనసాగాలంటే దీర్ఘకాలిక విధానాలు, మౌలిక సదుపాయాల అందుబాటు, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకమని నివేదిక హెచ్చరిస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us