
జాతీయ రహదారులపై టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. సవరించిన జాతీయ రహదారి రుసుము నిబంధనలు 2026 ప్రకారం టోల్ ఎగవేత చేసిన వాహన యజమానులకు నేరుగా ఈ-నోటీసులు పంపే విధానం అమల్లోకి వచ్చింది. ఈ చర్యలతో టోల్ వ్యవస్థను మరింత డిజిటల్, పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త విధానం ప్రకారం ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC)లో నమోదు చేసిన వాహనం టోల్ చెల్లించకుండా ప్రయాణిస్తే, అది చెల్లించని వినియోగ రుసుముగా పరిగణించబడుతుంది. ఆ వెంటనే వాహన యజమానికి SMS, ఇమెయిల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ-నోటీసు పంపబడుతుంది.
ఇందులో వాహన వివరాలు, ప్రయాణించిన తేదీ, సమయం, టోల్ ప్లాజా సమాచారం, చెల్లించాల్సిన మొత్తం వంటి వివరాలు ఉంటాయి. ఈ సమాచారం ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. నోటీసు అందిన 72 గంటలలోపు చెల్లింపు చేస్తే, కేవలం అసలు టోల్ మాత్రమే వసూలు చేస్తారు. అయితే ఆ గడువు దాటితే రెట్టింపు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. నోటీసు తప్పుగా ఉందని భావించే వారికి కూడా అవకాశం ఉంది, 72 గంటలలోపు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదును 5 రోజులలోపు పరిష్కరించాల్సి ఉంటుంది.
ఇంకా 15 రోజుల్లోగా టోల్ చెల్లించకపోతే లేదా ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయకపోతే, బకాయి మొత్తాన్ని వాహన డేటాబేస్‌లో నమోదు చేస్తారు. దీనివల్ల వాహనానికి సంబంధించిన కొన్ని సేవలను నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఈ చర్యలు టోల్ ఎగవేతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా NHAI నిర్వహిస్తున్న ఫాస్టాగ్ వార్షిక టోల్ పాస్ ధర కూడా స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పాస్ ధర రూ.3,000 నుంచి రూ.3,075కు పెరిగింది. ఈ పెరుగుదల చిన్నదిగా కనిపించినప్పటికీ, తరచుగా జాతీయ రహదారులను ఉపయోగించే వాహనదారులపై అదనపు భారం పడనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి