హమ్మయ్య.. ఎట్టకేలకు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserves) మళ్లీ పెరిగాయి. వరుసగా గత 8 వారాలుగా ఫారెక్స్ నిల్వలు తగ్గుతుండగా.. నవంబర్ 29తో ముగిసిన వారానికి విదేశీ మారకపు నిల్వలు పెరిగాయి. ఆ వారంలో 1.51 బిలియన్ డాలర్లు (రూ.12,500 లక్షల కోట్లు) పెరిగిన ఫారెక్స్ నిల్వలు .. 658.091 బిలియన్ డాలర్లు (రూ.55.27 లక్షల కోట్లు)కు చేరాయి. ఆ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారంనాడు విదేశీ మారకపు నిల్వలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
అంతకు ముందు నవంబర్ 22తో ముగిసిన వారం భారత ఫారెక్స్ నిల్వలు 1.31 బిలియన్ డాలర్లు తగ్గి 656.582 బిలియన్ డాలర్లుగా ఉంది. సెప్టెంబర్ చివర్లో ఫారెక్ట్ 704.885 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ హై స్థాయికి చేరింది. ఆ తర్వాత క్రమంగా విదేశీ మారకపు నిల్వలు తగ్గుతూ వచ్చాయి. నవంబర్ 22తో ముగిసిన వారానికి వరుసగా 8వ వారం కూడా ఫారెక్ట్ నిల్వలు క్షీణించాయి. రూపాయి విలువ పతనాన్ని నిరోధించే దిశగా ఆర్బీఐ తీసుకున్న కీలక నిర్ణయాలు ఫలించడంతో.. ఎట్టకేలకు నవంబర్ 29తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు పెరిగాయి.
కాగా నవంబర్ 29తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వల్లో సింహ భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 2.06 బిలియన్ డాలర్లు పెరిగి 568.85 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది భారత విదేశీ మారకపు నిల్వలు పెరిగేందుకు దోహదపడింది. అలాగే పసిడి నిల్వలు 595 మిలియన్ డాలర్లు తగ్గి 66.979 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్బీఐ తెలిపింది.