
భారతదేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్, డచ్ సెమీకండక్టర్ పరికరాల దిగ్గజం ASML మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. అధునాతన చిప్ తయారీలో కీలకమైన లిథోగ్రఫీ పరికరాల రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం కలిగిన ASMLతో టాటా చేతులు కలపడం భారత సెమీకండక్టర్ రంగానికి పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. ఈ భాగస్వామ్యంతో గుజరాత్‌లోని దోలెరాలో టాటా ఎలక్ట్రానిక్స్ నిర్మిస్తున్న 300 mm సెమీకండక్టర్ ఫ్యాబ్‌కు ASML పూర్తి స్థాయి సాంకేతిక మద్దతు అందించనుంది. సుమారు రూ.91,000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ యూనిట్ భారతదేశపు తొలి వాణిజ్య సెమీకండక్టర్ వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌గా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌లోనే ఆధునిక చిప్‌ల తయారీకి అవసరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందనున్నాయి.
చిప్ తయారీలో అత్యంత కీలకమైన లిథోగ్రఫీ పరికరాలు, సాంకేతిక పరిష్కారాలు, ఆర్&డి మద్దతును ASML అందించనుంది. దీని వల్ల ధోలేరా ఫ్యాబ్ కార్యకలాపాలు సకాలంలో ప్రారంభమై, పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయగలదని టాటా ఎలక్ట్రానిక్స్ పేర్కొంది. అదేవిధంగా స్థానిక ప్రతిభకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సరఫరా గొలుసు బలోపేతంపై కూడా రెండు సంస్థలు దృష్టి సారించనున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్ సీఈఓ, ఎండీ రణ్‌ధీర్ ఠాకూర్ మాట్లాడుతూ.. ASMLకు ఉన్న లిథోగ్రఫీ నైపుణ్యం తమ ఫ్యాబ్ విజయానికి కీలకమవుతుందని అన్నారు. ప్రపంచ వినియోగదారులకు నమ్మకమైన సరఫరా గొలుసును నిర్మించడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇక ASML ప్రెసిడెంట్, సీఈఓ క్రిస్టోఫ్ ఫౌక్వెట్ మాట్లాడుతూ.. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ మార్కెట్‌గా మారుతోందని, దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఇది అనుకూల సమయమని చెప్పారు. టాటా ఎలక్ట్రానిక్స్ తన సెమీకండక్టర్ సామర్థ్యాలను వేగంగా విస్తరించే స్థితిలో ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ధోలేరా యూనిట్ ఆటోమోటివ్, మొబైల్ పరికరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తదితర రంగాలకు అవసరమైన చిప్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తైవాన్‌కు చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కలిగిన టాటా, 28nm నుంచి 110nm వరకు పలు సాంకేతిక పరిజ్ఞానాలకు ప్రాప్యతను పొందింది. దీంతో భారత్‌లో అధునాతన చిప్ తయారీ సామర్థ్యాలు మరింత వేగంగా అభివృద్ధి చెందనున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి