Indian Railways: రైలులో ఈ జంతువులను తీసుకెళ్లొచ్చు.. టికెట్ ఎలా బుక్ చేయాలంటే..?
పెంపుడు జంతువులతో రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి భారతీయ రైల్వే ప్రత్యేక రూల్స్ ప్రకటించింది. కుక్కలు, పిల్లులతో ప్రయాణించడానికి ఫస్ట్ ఏసీ లేదా ఫస్ట్ క్లాస్‌లో కూపే - క్యాబిన్ బుక్ చేసుకోవాలి. IRCTC ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ అందుబాటులో ఉంది. పెంపుడు జంతువుల టికెట్లకు రీఫండ్ ఉండదు.

క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల కోసం హిల్ స్టేషన్లు లేదా స్వస్థలాలకు ప్రయాణించే పెంపుడు జంతువుల యజమానులకు భారతీయ రైల్వే గూడ్ న్యూస్ తెలిపింది. ముఖ్యంగా పాఠశాలలకు సెలవులు ఉండే ఈ పండుగ సీజన్‌లో తమ పెంపుడు కుక్కలు లేదా పిల్లులను ఇంట్లో ఒంటరిగా వదిలేయకుండా వాటిని తమతో తీసుకెళ్లాలని కోరుకునే వారికి రైలు ప్రయాణం బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. భారతీయ రైల్వే రూల్స్ ప్రకారం.. యజమానులు తమ పెంపుడు జంతువులను రైలులో ఎలా తీసుకెళ్లాలి..బుకింగ్ విధానం ఏమిటీ..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రైలులో పెట్స్ ప్రయాణానికి రూల్స్
రైలులో కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను తీసుకెళ్లడానికి కొన్ని నిర్దిష్ట నియమాలను రైల్వే శాఖ అమలు చేస్తోంది. మొత్తం 4 బెర్త్‌ల క్యాబిన్ లేదా 2 బెర్త్‌ల కూపేను ఒకే PNR కింద బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే యజమానులతో పాటు ఉన్న కుక్కలు లేదా పిల్లులను ఫస్ట్ ఏసీ లేదా ఫస్ట్ క్లాస్‌లో తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. క్యాబిన్ లేదా కూపే కేటాయింపు అభ్యర్థన: క్యాబిన్ లేదా కూపే కేటాయించడం కోసం యజమానులు డివిజనల్ రైల్వే మేనేజర్ లేదా జనరల్ మేనేజర్ కార్యాలయంలో తమ రిక్వెస్ట్‌ను సమర్పించాలి. అటువంటి అభ్యర్థనలను రైల్వే పరిగణనలోకి తీసుకుంటుంది. చిన్న కుక్కపిల్లలు లేదా పిల్లులను యజమానులు బుట్టలో తీసుకెళ్లగలిగితే, వాటిని సాధారణ బుకింగ్ ఛార్జీలు చెల్లించి ఏ తరగతిలోనైనా తీసుకెళ్లడానికి అనుమతి ఉంది.
ఆన్‌లైన్‌లో బుకింగ్ విధానం
పెంపుడు జంతువుల టికెట్ బుకింగ్‌ను IRCTC ఇ-టికెటింగ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. టికెట్ బుకింగ్ మొదటి చార్ట్ తయారీ పూర్తయిన తర్వాత తుది చార్ట్ తయారుచేసే వరకు మాత్రమే అనుమతిస్తారు.
బుకింగ్ దశలు
దశ 1 : IRCTC ఇ-టికెటింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. TRAINS మెనూపై క్లిక్ చేసి ‘‘కుక్కలు/పిల్లుల బుకింగ్” ఆప్షన్ ఎంచుకోవాలి.
దశ 2: ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీరు నేరుగా రైల్వే పార్సెల్ వెబ్‌సైట్‌కి వెళ్తారు. అక్కడ మీ మొబైల్ నంబర్, OTP, ఇమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలి.
దశ 3: మీ PNR నంబర్‌ను నమోదు చేసి మీ ప్రయాణం పెంపుడు జంతువుల బుకింగ్‌కు అర్హత కలిగి ఉందో లేదో తనిఖీ చేయాలి. అర్హత ఉంటే మీరు తీసుకెళ్లాలనుకుంటున్న కుక్కలు/పిల్లుల సంఖ్యను ఎంచుకోవాలి.
దశ 4: మీ ID వివరాలు ఇచ్చి పేమెంట్ బటన్‌పై క్లిక్ చేయండి. SBI పేమెంట్ గేట్‌వే ద్వారా సరుకు రవాణా ఛార్జీల చెల్లింపును పూర్తి చేయాలి.
దశ 5: పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత లగేజ్ టికెట్ నంబర్‌తో కూడిన పేజీ కనిపిస్తుంది. ఆ టికెట్ మీ మెయిల్ ఐడీకి వస్తుంది.
టికెట్ బుకింగ్ పూర్తయిన తర్వాత TTE యొక్క హ్యాండ్‌హెల్డ్ పరికరంలో కూడా మీ పెంపుడు జంతువుల బుకింగ్ వివరాలు కనిపిస్తాయి.
రీఫండ్ ఉండదు
PNR రద్దు తర్వాత అలాగే రైలు రద్దు లేదా ఆలస్యంగా నడిచిన సందర్భాల్లో కూడా పెంపుడు జంతువుల కోసం బుక్ చేసుకున్న లగేజీ టికెట్లకు చెల్లించిన ఛార్జీలకు రీఫండ్ ఉండదు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




