Indian Railway: అమెరికా, జపాన్ తర్వాత భారత్‌లోనూ పాడ్ హోటల్ మొదలైంది. భారతీయ రైల్వే ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో మొదటి పాడ్ హోటల్‌ను ప్రారంభించింది. ప్రయాణం చేసి అలసిపోయిన ప్రయాణికులు ఇక్కడకు వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు. పాడ్ హోటల్‌లో క్యాప్సూల్ ఆకారంలో ఉన్న గదిలో మీరు 12 నుంచి 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. IRCTC ప్రకారం.. మొదటి అంతస్తులో నిర్మించిన పాడ్ హోటల్‌లో 48 గదులు ఉన్నాయి. అవి 7 అడుగుల పొడవు 4 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఇందులో సౌకర్యవంతమైన మంచం కూడా ఉంటుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ ఈ హోటల్‌కి సంబంధించిన అనేక చిత్రాలను తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. రైల్వే ప్రకారం ఇక్కడ బస చేయడానికి రూ.999 నుంచి రూ.1999 వరకు ఛార్జ్ చేస్తారు. పాడ్ హోటల్‌లో ఉండే ప్రయాణికులకు వైఫై, అడ్జస్టబుల్ మిర్రర్, స్మార్ట్ లాక్, రీడింగ్ లైట్ మొదలైన సౌకర్యాలు కల్పిస్తారు. జపాన్, రష్యా, యుకె, యుఎస్, మలేషియా, సింగపూర్, నెదర్లాండ్స్‌లో ఇటువంటి పాడ్ హోటళ్లు ఎప్పుడో ప్రారంభించారు. అక్కడ ఇలాంటి హోటళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. సౌకర్యాల బట్టి ఈ హోటల్ 4 వర్గాలుగా విభజించారు.
క్లాసిక్ పాడ్‌లు, లేడీస్ పాడ్‌లు, ప్రైవేట్ పాడ్‌లు, వికలాంగుల కోసం ప్రత్యేక పాడ్‌లు ఉన్నాయి. ఈ కేటగిరీల ప్రకారం ఛార్జీలు వసూలు చేస్తారు. కొన్ని సౌకర్యాలు సాధారణం అయినప్పటికీ శాటిలైట్ టీవీ, Wi-Fi కాంప్లిమెంటరీగా ఉంటాయి. పాడ్ హోటల్, దాని పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. బ్యాగేజీ లాకర్, పవర్ సాకెట్, USB పోర్ట్ అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా ఈ హోటల్‌లో ఫలహారశాల కూడా ఉంటుంది. ఇందులో రాత్రి 10 గంటల వరకు ఆహారం అందుబాటులో ఉంటుంది. పాడ్ హోటల్ 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దీని క్యాప్సూల్ ఫారమ్ రైల్వే డార్మిటరీ ఆధునిక వెర్షన్.