భారత రైల్వే శాఖ తన ఆదాయాన్ని మరింతగా పెంచుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ప్రయాణికుల విభాగంలో భారత రైల్వే 76 శాతం ఆదాయన్ని సంపాదించుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది రూ.24,631 కోట్ల ఆదాయం ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య రూ. 43,324 కోట్లు గడించిందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది .ప్రయాణికుల రిజర్వేషన్ విభాగంలోనే ఈ ఆర్థిక సంవత్సరం 50 శాతంకు మించిన ఆదాయం వచ్చింది. గత సంవత్సరం రూ. 22,904 కోట్లు ఉండగా, ఈ ఏడాది అది రూ. 34,303 కోట్లు పెరిగింది. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య 10 శాతం పెరిగింది.
అయితే గత ఏడాది ఇదే సమయంలో 48.60 కోట్ల మంది బుక్ చేసుకోగా, ఈ ఏడాది అది 53.65 కోట్లకు పెరిగింది. ఇక రిజర్వేషన్ చేయించుకోని ప్రయాణికుల విషయానికి వస్తే ఏప్రిల్ నుంచి నవంబర్ 30 వరకు వారి సంఖ్య 155 శాతం పెరిగింది. గత ఏడాది అన్ రిజర్వుడ్ ప్రయాణికుల సంఖ్య 138.13 కోట్లు ఉండగా, ఈ ఏడాది అది 352.73 కోట్లకు పెరిగింది.
భారతీయ రైల్వే గత సంవత్సరం రూ. 91,127 కోట్లు గడించగా, ఈ ఏడాది రూ. 1,05,905 కోట్లు గడించింది. ఈ లెక్కన పరిశీలిస్తే16 శాతం ఆదాయం పెరిగిందనే చెప్పాలి. రైల్వే శాఖ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.58,500 కోట్ల ప్రయాణికుల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం పెరుగుదల ఉంది. కరోనా తర్వాత రైల్వే శాఖ మరింతగా మెరుగు పడింది. కరోనా కాలంలో ఆదాయం తగ్గిపోగా, వైరస్ తగ్గుముఖం తర్వాత ఆదాయం పెరిగింది.
రైల్వే ప్రయాణికుల ఆదాయంలో ఎక్కువ భాగం సుదూర రైళ్ల నుండి వస్తుంది. కొన్నేళ్లుగా రైల్వే తన ప్రయాణికుల సేవల నిర్వహణ వ్యయాన్ని పూర్తిగా రికవరీ చేయలేకపోయింది. 2015-2020లో AC-3 టైర్ సెగ్మెంట్ మినహా మిగిలిన అన్ని ప్యాసింజర్ సర్వీసులు నష్టాలను నమోదు చేశాయి.
ఈ నష్టాలు సరుకు రవాణా సేవల ద్వారా వచ్చే ఆదాయాల ద్వారా భర్తీ చేయబడుతోంది. రైళ్లలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 978.72 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా అయింది. గత ఏడాది 903.16 మెట్రిక్ టన్నులు ఉండగా, సుమారు 8 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఒక్క నవంబర్ నెలలోనే 123.9 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేయగా, గత ఏడాది ఇదే కాలంలో పోలిస్తే 5 శాతం ఎక్కువ పెరిగింది. దేశంలో కరోనా మహమ్మారి సమయంలో ప్రయాణికుల రైళ్లు రద్దు కావడంతో సరుకు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది రైల్వే. కోవిడ్ ఉన్న సమయంలో 2020 ఏప్రిల్‌లో 1209 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేయగా, గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1400 మెట్రిక్ టన్నుఉల రవాణా చేసింది. 202324తో దీనిని 2000 మెట్రిక్ టన్నులకు పెంచుకునే లక్ష్యంగా పెట్టుకుంది రైల్వేశాఖ.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి