
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు తీపికబురు. ఈ మేరకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సర్వీసులు అందిస్తుండగా.. మరో రైలు సామాన్య ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు రైలు ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 11వ తేదీన ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ రైళ్ల టైమ్ షెడ్యూల్స్, ఏయే స్టేషన్లలో ఆగుతుంది? అనే వివరాలను కూడా ప్రకటించింది. వాటి వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.
నాగర్ కోయిల్-చర్లపల్లి-నాగర్ కోయల్ మధ్య కొత్త అమృత్ భారత్ రైలు ప్రారంభించేందుకు రైల్వే బోర్డు అనుమతులు మంజూరు చేసినట్లు మార్చి 10వ తేదీన దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడులోని నాగర్ కోయిల్, హైదరాబాద్‌లోని చర్లపల్లి మధ్య ఈ రైలు సర్వీసులు అందించనుంది. బుధవారం ఈ రైలు ప్రారంభం కానుంది. నాగర్ కోయిల్-చర్లపల్లి(06357) రైలు బుధవారం 17.30 గంటలు నాగర్ కోయిల్ నుంచి బయల్దేరుతుంది. వల్లియూర్ స్టేషన్‌కు 18.20, తిరుణెవల్లికి రూ.19.35, కొవిల్ పట్టికి 20.33, సాతూర్‌కు 20.53కు, విరుదునగర్‌కు 21.53 గంటలకు, మధురైకు 22.40కు, దుండిగల్‌కు 23.43కు, తిరుచాచిపల్లి 01.40, తంజావూర్ 02.43, పాపనాశనంకు 03.05 గంటలకు, కుంభకోణంకు 03.18కు, చిదంబరంకు 5 గంటలు, విల్లుపురం జంక్షన్‌కు 06.55 గంటలకు, చెన్నై ఎగ్మోర్‌కు 09.55కు, సుళ్లూరుపేటకు 11.48కు, నెల్లూరుకు 13.18కు, ఒంగోలుకు 14.48కు, చీరాలకు 15.20కు, బాపట్లకు 15.35కు, తెనాలికి 16.48 గంటలకు చేరుకుంటుంది.
ఇక గుంటూరుకు 17.40 గంటలకు, సత్తెనపల్లికి 18.59 గంటలకు, మిర్యాలగూడకు 20.59 గంటలకు, నల్లగొండకు 21.29 గంటలకు చేరుకోనుంది. ఇక చర్లపల్లికి 23.45 గంటలకు చేరుకుంటుందని రైల్వేశాఖ తన ప్రకటనలో తెలిపింది. ఈ రైలు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను కవర్ చేస్తోంది. దీంతో నాలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ఇందులో నాన్ ఏసీ స్లీపర్, జనరల్ క్లాసులు అందుబాటులో ఉంటాయి. సదూర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇది సేవలు అందించనుంది. తక్కువ ధరతో వీటిల్లో ప్రయాణం చేయవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రయాణం చేస్తున్నాయి. ఇది మూడో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌గా చెప్పవచ్చు. అటు త్వరలో చర్లపల్లి-కామాఖ్య మధ్య మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రైల్వేశాఖ నుంచి ప్రకటన రాగా.. త్వరలోనే ప్రారంభించనున్నారని తెలుస్తోంది.