
భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇది రోజుకు దాదాపు 13,000 ప్యాసింజర్ రైళ్లను నడుపుతుంది. అంటే ప్రతిరోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తారు. మీరు రైల్లో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే, మీరు ఇంటి నుండి ఆహారాన్ని వెంట తెచ్చుకుంటారు. కొంతమంది రైలులో ఆహారాన్ని కూడా కొంటారు. అయితే, రైలులో వేడి భోజనాన్ని ఆస్వాదించడానికి మీరు ధర చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందించే ఒక రైలు భారతీయ రైల్వేలో ఉందని మీకు తెలుసా..? ఈ ఉచిత ఆహారం ఎలా ఇస్తారు..? ఈ రైలు ఏ మార్గంలో నడుస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఏ రైలులో ఆహారం ఉచితంగా లభిస్తుంది?
ఆ రైలు పేరు సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ (12715). భారతీయ రైల్వేలలో ఉచిత భోజనం అందించే ఏకైక రైలు ఇదే. సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ దాని 2081 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రయాణీకులకు ఉచిత అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం అందిస్తుంది. సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌లో గత మూడు దశాబ్దాలుగా ఉచిత ఆహారం అందించబడుతోంది. ఇది లంగర్ (కమ్యూనిటీ కిచెన్) ద్వారా సాధ్యమవుతుంది. ప్రయాణికులు ఎటువంటి రద్దీ లేకుండా తినడానికి వీలుగా రైలు తగినంత సమయం ఆగుతుంది. లంగర్‌లో పాల్గొనడానికి ప్రయాణీకులు తరచుగా తమ సొంత పాత్రలను వెంట తెచ్చుకుంటూ ఉంటారు. ఇందులో ఆకు కూరలు, పప్పులు, ఇతర కూరగాయలు వంటి రుచికరమైన శాఖాహార ఆహారం ఉంటుంది.
సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ (12715) ఏ మార్గంలో నడుస్తుంది?
సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ అమృత్‌సర్, నాందేడ్ మధ్య నడుస్తుంది. ఈ రైలు రెండు ముఖ్యమైన సిక్కు మత ప్రదేశాలను కలుపుతుంది. అమృత్‌సర్‌లోని శ్రీ హర్మందిర్ సాహిబ్, నాందేడ్‌లోని శ్రీ హజుర్ సాహిబ్. సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ 39 స్టేషన్లలో ఆగుతుంది. ఈ మార్గంలోని ఆరు స్టాప్‌లలో ప్రయాణీకులకు ఉచిత భోజనం అందిస్తారు.. రైలుకు దాని స్వంత ప్యాంట్రీ కూడా ఉంది. కానీ ప్రతి ప్రయాణీకుడికి లంగర్ వడ్డిస్తారు. దాదాపు 2,000 మంది ప్రతిరోజూ ఉచిత భోజనం తింటారు. ఉచిత లంగర్ సేవ దాదాపు 30 సంవత్సరాల క్రితం 1995లో ప్రారంభించబడింది. అప్పటి నుండి లక్షలాది మంది ప్రయాణికులకు ఆహారాన్ని అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి