Solar Cooking Stove: సోలార్‌ స్టవ్‌ను ఆవిష్కరించిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్.. ఇంట్లోనే ఉంచి వంట చేయ్యొచ్చట..

|

Jun 23, 2022 | 12:06 PM

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ బుధవారం సోలార్‌ స్టౌవ్‌ను ఆవిష్కరించింది. ఈ స్టౌవ్‌ను ఒక్కసారి కొనుగోలు చేస్తే దీనికి మెయింటనెన్స్‌ ఉండదని తెలిపింది...

Solar Cooking Stove: సోలార్‌ స్టవ్‌ను ఆవిష్కరించిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్.. ఇంట్లోనే ఉంచి వంట చేయ్యొచ్చట..
Solar Stove
Follow us on

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ బుధవారం సోలార్‌ స్టవ్‌ను ఆవిష్కరించింది. ఈ స్టవ్‌ను ఒక్కసారి కొనుగోలు చేస్తే దీనికి మెయింటనెన్స్‌ ఉండదని తెలిపింది. ఇది శిలాజ ఇంధనాలకు ప్రత్యమ్నాయంగా తీసుకొచ్చామని వివరించింది. అయితే సోలార్‌ పోయ్యి అంటే ఎండలో ఉండాలని అనుకుంటారు. కానీ సోలార్‌ స్టౌవ్‌ వంటగదిలోపలే ఉంటూ, సౌరశక్తిని వినియోగించుకుని పని చేస్తుంది. చమురు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ పొయ్యిపై ఆహారం వండి చూపించారు. ఇంటి పైకప్పుపై ఉంచే సౌరప్యానెల్‌ సౌరశక్తిని గ్రహించి, కేబుల్‌ ద్వారా పొయ్యికి చేరవేస్తుందని ఐఓసీ డైరెక్టర్‌ (ఆర్‌ అండ్‌ డీ) ఎస్‌ఎస్‌వీ రామకుమార్‌ చెప్పారు. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన హీటింగ్‌ ఎలిమెంట్‌ వల్ల, ఉష్ణోగ్రత పెరిగి, వంట చెయ్యవచ్చని పేర్కొన్నారు. సౌరశక్తిని నిల్వ చేసుకునే థర్మల్‌ బ్యాటరీ వల్ల రాత్రిళ్లు కూడా ఈ పొయ్యిపై వంట చేసుకోవచ్చని తెలిపారు.

ఈ పోయ్యి ద్వారా నలుగురికి సరపడా ఆహారం సిద్ధం చేసుకునేందుకు వీలవుతుందని చెప్పారు. పరీక్షలు పూర్తయ్యాక 2-3 నెలల్లో వాణిజ్య తయారీ ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ పొయ్యి ఖరీదు ప్రస్తుతం రూ.18,000-30,000 మధ్య ఉందని చెప్పారు. అధిక తయారీకి తోడు ప్రభుత్వ రాయితీలతో రూ.10,000-12,000కు లభించే అవకాశం ఉందని తెలిపారు. నిర్వహణ భారం లేకుండా, పొయ్యి పదేళ్లపాటు; సౌర ప్యానెల్‌ 25 ఏళ్లు పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ పొయ్యి తయారీని సొంతంగా లేదా కాంట్రాక్టు తయారీ పద్ధతిలో చేపడతామని ఐఓసీ ఛైర్మన్‌ ఎస్‌.ఎం. వైద్య వెల్లడించారు. రోటీని ఉడకబెట్టడం, ఆవిరి చేయడం, వేయించడం, వండడం వంటి పూర్తి స్థాయి వంటలకు దీనిని ఉపయోగించవచ్చన్నారు. ఛార్జీ తక్కువగా ఉన్నప్పుడు లేదా మేఘావృతమైన రోజులలో విద్యుత్ గ్రిడ్‌ను సహాయక సరఫరాగా ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.