పెట్రోల్, డీజిల్.. ప్రత్యేక పన్ను విధించిన కేంద్రం! ఇదైతే మన మంచికే..

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఇంధన భద్రత కోసం కేంద్రం పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై SAED విధించింది. పొరుగు దేశాలకు మినహాయింపునిచ్చిన ఈ నిర్ణయం దేశీయ వినియోగదారులపై భారం మోపదు. అంతర్జాతీయ ముడి చమురు ధరలను బట్టి ప్రతి 15 రోజులకు సుంకాన్ని సమీక్షిస్తారు.

పెట్రోల్, డీజిల్.. ప్రత్యేక పన్ను విధించిన కేంద్రం! ఇదైతే మన మంచికే..
Petrol Diesel Price

Updated on: Jun 30, 2026 | 9:43 PM

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సుంకాలు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం.. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.4, డీజిల్‌పై రూ.8.50, విమాన ఇంధనం (ATF)పై లీటరుకు రూ.7.50 చొప్పున ప్రత్యేక ఎగుమతి సుంకం విధించనుంది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో ఇంధన లభ్యత దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

అయితే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పొరుగు దేశాలకు చేసే సరఫరాలకు మినహాయింపు కల్పించింది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు తాజాగా మారిషస్, మాల్దీవులకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌పై ఈ ప్రత్యేక సుంకం వర్తించదని స్పష్టం చేసింది. ఇంధన సరఫరాకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాలను దృష్టిలో ఉంచుకుని ఈ మినహాయింపు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కేంద్రం మరోసారి స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, ఈ నిర్ణయం కేవలం ఎగుమతులకే పరిమితమని, దేశీయ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం ఉండదని పేర్కొంది. దేశీయ మార్కెట్‌లో విక్రయించే పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం అమల్లో ఉన్న కేంద్ర ఎక్సైజ్ సుంకంలో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించింది. దీంతో దేశీయంగా ఇంధన ధరలపై ఈ నిర్ణయం తక్షణ ప్రభావం చూపే అవకాశం లేదని భావిస్తున్నారు.

ఇక ప్రత్యేక ఎగుమతి సుంకాల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, పెట్రోల్, డీజిల్ సగటు ధరలు, ప్రపంచ పరిస్థితులు, దేశీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ సుంకాలను పెంచాలా, తగ్గించాలా లేదా యథాతథంగా కొనసాగించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో దేశీయ ఇంధన భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చమురు రంగంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

Follow Us