రష్యా నుంచి సబ్సిడీ ముడిచమురు దిగుమతులను రెట్టింపు చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. రష్యా సంస్థ రోస్‌నెఫ్ట్ నుంచి భారీ చౌక ధరకు మరింత ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీయ ప్రభుత్వ – ప్రైవేటు రంగ రిఫైనరీలు ఆసక్తి చూపుతున్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని దేశాలు రష్యా నుంచి ముడిచమురు కొనుగోలును ఆపేయాలని నిర్ణయానికి రావడం వల్ల, ఆ మేర చమురును పొందొచ్చని భారత సంస్థలు భావిస్తున్నాయి. కొత్తగా ఆరు నెలల కాలానికి సరఫరా కాంట్రాక్టులు కుదుర్చుకునేందుకు ఈ సంస్థలు సంయుక్తంగా సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిసింది. సరఫరా బాధ్యతతో పాటు బీమా వ్యవహారాలను కూడా రోస్‌నెఫ్ట్ చూసుకోవాల్సి ఉంటుందట. తాజా ఒప్పందాలు ఖరారైతే, ఇప్పటికే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుకు ఇది అదనం. దిగుమతుల పరిమాణం, ధరలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది.
ఈ సరఫరాలు అన్నింటికీ ఆర్థికసాయం చేసే భారత బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించాక రష్యా చమురు దిగుమతులపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ పరిణామాన్ని భారత్ అనుకూలంగా మలచుకుని, రష్యా నుంచి చౌకగా ముడిచమురును కొనుగోలు కొనసాగిస్తోంది. తాజాగా రోస్‌నెఫ్ట్ లాంటి రష్యా కంపెనీల నుంచి నేరుగా చమురును దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వ రంగ రిఫైనరీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌తో పాటు ప్రైవేటు సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నయర ఎనర్జీ కూడా ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తుంది. ఫిబ్రవరి నుంచి మే ఆరంభం వరకు రష్యా నుంచి 40 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంది. 2021 మొత్తం మీద జరిగిన దిగుమతుల కంటే ఇది 20 శాతం ఎక్కువ అని బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది.