Railway Connectivity: దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని ఏకైక రాష్ట్రం ఏదో మీకు తెలుసా?

ఇండియన్ రైల్వేస్.. ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ. దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచిన ఈ రైల్వే వ్యవస్థ, ఒక్క రాష్ట్రానికి మాత్రం ఇప్పటికీ పరిచయం కాలేదు. అవును, వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! మన దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీసులు లేని ఒక రాష్ట్రం ఉందని మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే.. ఆ రాష్ట్రం ఏది? ఇప్పటికీ అక్కడ రైల్వే సేవలు ఎందుకు అందుబాటులోకి రాలేదో ఇప్పుడు తెలుసుకుందాం.

Railway Connectivity: దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని ఏకైక రాష్ట్రం ఏదో మీకు తెలుసా?
India's Unreached State Rail

Updated on: Jun 10, 2026 | 4:29 PM

ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వే, నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది. నదులు, పర్వతాలు, మైదానాలను సైతం కలుపుతూ వెళ్తున్న ఈ రైల్వే సర్వీస్‌లు.. ఇప్పటివరకు మన దేశంలోని ఒక రాష్ట్రానికి మాత్రం చేరుకోలేకపోయాయి. అదే హిమాలయ రాష్ట్రమైన సిక్కిం. ఈ రాష్ట్రం ఇప్పటికీ భారతీయ రైల్వే పటంలో లేని ఒక అరుదైన గమ్యస్థానంగా మిగిలిపోయింది. సిక్కింలో ఇప్పటికీ రైల్వే స్టేషన్లు గానీ, పనిచేస్తున్న రైల్వే లైన్లు గానీ లేవు. దీంతో దేశంలో రైల్వే కనెక్టివిటీ లేని ఏకైక రాష్ట్రంగా సిక్కిం మిగిలిపోయింది.

రైల్వే లైన్ లేకపోవడానికి కారణాలు

హిమాలయ పర్వత ప్రాంతంలో ఉండటం, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు ఉండటం వల్ల ఇక్కడ ఇప్పటివరకు రైల్వే లైన్ నిర్మించడం సాధ్యపడలేదు. ప్రస్తుతం సిక్కిం ప్రజలు పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి లేదా న్యూ జల్‌పైగురి రైల్వే స్టేషన్ల వరకు వచ్చి, అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా సిక్కింకు ప్రయాణిస్తుంటారు.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం – సేవోక్ టు రంగ్‌పో ప్రాజెక్ట్

అయితే, ఈ ప్రాంతానికి ఎలాగైనా రైల్వే సేవలు తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సిక్కిం పక్క రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లోని సేవోక్ నుండి సిక్కింలోని రంగ్‌పో వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టింది. సవాళ్లతో కూడిన హిమాలయ భూభాగం గుండా సుమారు 45 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంటుంది.

ప్రాజెక్టులోని ప్రధాన సవాలు:

ఈ రైల్వే లైన్‌ను నిర్మించేందుకు తీస్తా లోయ మీదుగా పెద్ద పెద్ద సొరంగాలు , భారీ రైల్వే బ్రిడ్జ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది దేశంలోనే అత్యంత క్లిష్టమైన రైల్వే ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోంది. కానీ, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సిక్కింకు కూడా రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

ఎప్పటికి పూర్తవుతుంది?

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇందులో సింహభాగం పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. అంతేకాదు, 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయి రైల్వే లైన్ అందుబాటులోకి రావచ్చునని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే సిక్కిం ప్రజల రవాణా కష్టాలు తీరడమే కాకుండా.. అక్కడి పర్యాటకరంగం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా ఎంతగానో పుంజుకుంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us