ఇండియాలో ఎలన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌పై పరిమితులు..! తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం స్టార్ లింక్ కంపెనీకి భారతదేశంలో 20 లక్షల కనెక్షన్ల పరిమితి విధించింది. టెలికాం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది BSNL, ఇతర టెలికాం కంపెనీలకు ఉపశమనం కలిగించింది. స్టార్ లింక్ 200 Mbps వేగం అందిస్తుందని, కానీ దాని సామర్థ్యం పరిమితం అని ప్రభుత్వం తెలిపింది.

ఇండియాలో ఎలన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌పై పరిమితులు..! తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం
Elon Musk

Updated on: Jul 28, 2025 | 6:07 PM

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌ కంపెనీకి ఇండియాలో పరిమితులు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు అందించే స్టార్‌లింక్ భారతదేశంలో 20 లక్షల కనెక్షన్‌లను మాత్రమే కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్‌ఎన్‌ఎల్, ఇతర టెలికాం కంపెనీలకు ఇది పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు.

బిఎస్‌ఎన్‌ఎల్ సమీక్ష సమావేశంలో టెలికాం శాఖ సహాయ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. స్టార్‌లింక్ భారతదేశంలో 20 లక్షల మంది కస్టమర్లను మాత్రమే కలిగి ఉంటుంది. 200 Mbps వరకు వేగాన్ని అందిస్తుంది. అది టెలికాం సేవలను ప్రభావితం చేయదు అని మంత్రి అన్నారు. BSNL గణనీయమైన ఉనికిని కలిగి ఉన్న గ్రామీణ, మారుమూల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని శాట్కామ్ సేవలు అందించాలని భావిస్తున్నారు. స్టార్‌లింక్ కనెక్షన్‌లపై పరిమితి దాని ప్రస్తుత సామర్థ్యం కారణంగా ఉందని పేర్కొన్నారు.

శాట్‌కామ్ సేవలకు ముందస్తు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందని, నెలవారీ ఖర్చు దాదాపు రూ.3,000 ఉండవచ్చని మంత్రి అన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ 4జి రోల్ అవుట్ పూర్తయిందని, ప్రస్తుతానికి టారిఫ్‌లను పెంచే ఆలోచన లేదని మంత్రి అన్నారు. మాకు మార్కెట్ ముందు కావాలి. సుంకాల పెంపుదల ప్రణాళిక లేదు అని ఆయన అన్నారు. 4G సేవలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో BSNL ఆదాయంలో 20-30 శాతం పెరుగుదల కనిపించిందని, సాంకేతికత స్థిరపడుతోందని మంత్రి అన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి