Budget 2024: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. నిర్మలమ్మ పద్దులో కీలక నిర్ణయం?

|

Jul 03, 2024 | 1:43 PM

కొన్ని ఆర్థిక సంస్థల నివేదికల ప్రకారం కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రధాన మంత్రి కార్యాలయంలో సంప్రదింపులు, అంతర్గత మదింపులను అనుసరించి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మొదటి బడ్జెట్‌లో ఈ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు.

Budget 2024: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. నిర్మలమ్మ పద్దులో కీలక నిర్ణయం?
Budget 2024
Follow us on

కేంద్ర బడ్జెట్ సమయం ఆసన్నమైంది. ఈ నెలలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్-2024ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంలో మూడో సారి బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో అన్ని వర్గాల వారు బడ్జెట్ లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు. అయితే కొన్ని ఆర్థిక సంస్థల నివేదికల ప్రకారం కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రధాన మంత్రి కార్యాలయంలో సంప్రదింపులు, అంతర్గత మదింపులను అనుసరించి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మొదటి బడ్జెట్‌లో ఈ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏమిటి? అది ఇప్పటి వరకూ ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉండే అవకాశం ఉంది? తెలుసుకుందాం రండి..

స్టాండర్డ్ డిడక్షన్‌ అంటే..

స్టాండర్డ్ డిడక్షన్ అనేది పన్ను చెల్లింపుదారులు తమ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి రసీదులు లేదా ఖర్చు రుజువుల అవసరం లేకుండా తీసివేయగల స్థిర మొత్తం. ఇది పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. తద్వారా మొత్తం పన్ను భారాన్ని తగ్గిస్తుంది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో జీతం పొందే వ్యక్తులు, పెన్షనర్‌లకు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రతిపాదించారు. పన్ను చెల్లింపుదారులు దీనిని నిలిపివేయాలని ఎంచుకుంటే తప్ప.. ఈ మినహాయింపు డిఫాల్ట్‌గా అందరికీ వర్తిస్తుంది. అదనంగా, సెక్షన్ 87ఏ కింద పన్ను మినహాయింపుకు అర్హత ఉన్న ఆదాయ పరిమితి రూ. 7 లక్షలకు పెంచారు. కొత్త పన్ను విధానంలో పన్ను గణనలను సులభతరం చేస్తూ అత్యధిక సర్‌ఛార్జ్‌ను కూడా తొలగించింది. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ పరిమితి సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఖర్చులు, ద్రవ్యోల్బణం రేట్లతో మెరుగ్గా సమలేఖనం చేయడానికి ప్రభుత్వం దీనిని కనీసం రూ.1 లక్షకు పెంచే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి.

స్టాండర్డ్ డిడక్షన్ గతంలో ఇలా..

  • 2004-2005లో జీతం పొందే వ్యక్తులు, పెన్షనర్‌లకు ఉపాధి సంబంధిత ఖర్చులను భర్తీ చేయడంలో సహాయపడటానికి ప్రారంభంలో ప్రవేశపెట్టిన స్టాండర్డ్ డిడక్షన్ పన్ను సరళీకరణ చర్యల్లో భాగంగా తొలగించారు.
  • 2018యూనియన్ బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ తిరిగి వచ్చింది. జీతం కలిగిన ఉద్యోగులు, పెన్షనర్లు ఇద్దరికీ పరిమితిని రూ.40,000గా నిర్ణయించారు.
  • 2019 మధ్యంతర బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 40,000 నుంచి రూ.50,000కి పెంచారు. ఇది జీతం పొందే వ్యక్తులు,పెన్షనర్‌లకు అదనపు ఉపశమనం అందిస్తుంది. అయితే, ఈ పెంపు పాత పన్ను విధానాన్ని అనుసరించే వారికే పరిమితం చేశారు.
  • 2023 బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారులకు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని అందించింది. తద్వారా పాత, కొత్త పన్నువిధానాల్లో ఒకే రకమైన పన్ను ఉపశమనం లభిస్తుంది.

చాలా ఉపశమనం..

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం వల్ల అధిక ఆదాయాలు ఉన్న వారితో సహా జీతం పొందే పన్ను చెల్లింపుదారులందరికీ పన్ను విధించదగిన ఆదాయం తగ్గుతుంది. పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక సవాళ్ల మధ్య ఈ చర్య చాలా ఉపశమనాన్ని అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..