సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెంగళూరులో(Bangalore) IKEA స్టోర్ ప్రారంభానికి సిద్ధమైంది. నగరంలోని నాగసంద్రలో ఉన్న స్టోర్ ను రేపు (జూన్ 22) న లాంఛనంగా ప్రారంభించనున్నారు. 4,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది భారతదేశంలోనే అతిపెద్ద రిటైలర్ స్టోర్ కావడం విశేషం. 3,000 కోట్ల పెట్టుబడితో పది వేల మందికి ఉపాధి కల్పించాలని సంస్థ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇంకా.. IKEA తన మొదటి సిటీ-సెంటర్ స్టోర్‌ను వచ్చే ఏడాది బెంగళూరులో ప్రారంభించాలని భావిస్తోంది. హైదరాబాద్(Hyderabad), ముంబయి, నవీ ముంబయిలలో స్టోర్లను ప్రారంభించిన తర్వాత ఇది భారతదేశంలో IKEA నాల్గో స్టోర్. హైదరాబాద్, ముంబయికి భిన్నంగా బెంగళూరులోని ఐకియా స్టోర్.. సాధారణ గృహాలంకరణ, ఫర్నిషింగ్ వస్తువులతో పాటు బాల్కనీ డిజైన్‌లతో మరింత విశాలంగా ఉండనుంది .12.2 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ స్టోర్‌లో స్వీడన్, ఇండియన్ ఫుడ్ మిక్స్‌తో ఓ రెస్టారెంట్ కూడా ఉండటం విశేషం.
ఏడు వేల రకాల ఉత్పత్తులలో ఇరవై ఏడు శాతం భారతదేశంలో ఉత్పత్తి చేయబడుతున్నాయి. ప్రస్తుతం స్టోర్‌లో దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నారు. రాబోయే నెలల్లో మరింత మంది స్థానిక ప్రతిభావంతుల నియామకం కొనసాగిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. మెట్రో స్టేషన్ పక్కనే స్టోర్ ఉన్నందున.. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని పువురు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఈ స్టోర్‌కు ఇలాంటి సమస్యే ఎదురైంది. దీంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా నిర్వాహకులు అడుగులు వేస్తున్నారు.