
రోడ్లపై ట్యాక్సీలు మనకు తెలుసు. ఒక్కక్లిక్ తో ఇంటిముందు వచ్చి పికప్ చేసుకొనే వ్యవస్థ ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ఇవి కేవలం రోడ్లపైనే ప్రయాణిస్తాయి. మరి గాలిలో ప్రయాణించాలంటే? విమానం ఎక్కాలి.. లేదంటే హెలికాప్టర్‌లో వెళ్లాలి. మరి గాలిలో ట్యాక్సీలాంటి వాహనం ఉంటే? అది కూడా ఒక్క క్లిక్‌తోనే మన డాబాపైకి వచ్చి వాలిపోతే? ఆ ఊహే చాలా అద్భుతంగా ఉంది కదూ. దీనిని త్వరలో నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఐఐటీ మద్రాస్ స్టార్టప్ కంపెనీ ద ఈ-ప్లేన్ వారు. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీని రూపొందించారు. రోడ్డుపై నడిచే ట్యాక్సీలకన్నా పది రెట్ల వేగంతో.. పది నిమిషాల్లో పదికిలోమీటర్ల దూరాన్ని చేరుకొనే విధంగా దానిని ఆవిష్కరించారు. పూర్తి పర్యావరణ హితమైన ఈ వాహన ప్రోటోటైప్ ని ఈ200 పేరిట బెంగళూరులోని ఏరో ఇండియా ఈవెంట్‌లో ప్రదర్శించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..
బ్యాటరీతో నడిచే ఈ ట్యాక్సీని పైలెట్ తో పాటు ఇద్దరు ప్రయాణించేందుకు వీలుగా దీనిని డిజైన్ చేశారు. భవిష్యత్తులో నలుగురు ప్రయాణికులు కూర్చునేలా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
ఫ్లయింగ్ ట్యాక్సీకి రన్ వేలు అవసరం లేదు, నిట్టనిలువుగా ఎగురుతుందని, అదే నిట్ట నిలువుగానే ల్యాండ్ అవుతుంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీనిలో ప్రొపెల్లర్ లో నాలుగు డక్ట్ ఫ్యాన్‌లను అమర్చింది. ఈ టాక్సీ గాలిలో 1500 అడుగుల (457 మీటర్లు) వరకు ఎగురుతుంది. దీనిలో సంస్థ ఇన్‌స్టాల్ చేసిన నాన్-స్వాప్ చేయదగిన బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 10 నుంచి 20 ట్రిప్పుల వరకు ప్రయాణిస్తుందని చెప్పారు.
సాధారణ ట్యాక్సీల కన్నా చార్జీలు రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని స్టార్టప్ సీటీవో ప్రొఫెసర్ సత్యా చక్రవర్తి, ఈ-ప్లేన్ కంపెనీ సీఈఓ ప్రాంజల్ మెహతా తెలిపారు. అయితే, ఇవి ఎక్కువగా అందుబాటులోకి వస్తే.. సాధారణ ట్యాక్సీల్లాగానే చార్జీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి చార్జీలు కొంచెం ఎక్కువైనా ట్రాఫిక్ ఇబ్బందులను ఇది తప్పిస్తుందన్నారు. 10 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుతుందన్నారు. ఇది ఏ నగరంలోనైనా రూఫ్ టాప్ టు రూఫ్ టాప్ ఎయిర్ మొబిలిటికీ అనువైందిగా వివరించారు.
ఫ్లయింగ్ టాక్సీ ఏ నగరంలోనైనా రూఫ్-టాప్ నుండి రూఫ్-టాప్ అర్బన్ ఎయిర్ మొబిలిటీకి అనువైనదని స్టార్టప్ పేర్కొంది. ఇ-ప్లేన్ వ్యాపారం మోడల్‌ను సిద్ధం చేయడానికి సుమారు ఒక మిలియన్ డాలర్ వరకూ ఖర్చు చేసినట్లు పేర్కొంది. రానున్న కాలంలో పైలెట్ లెస్‌గా దీనిని ఆవిష్కరించనున్నట్లు వివరించారు. బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 10 నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..