
ఈ రోజుల్లో డబ్బు అవసరమైనప్పుడల్లా టక్కున గుర్తొచ్చేది లోన్స్. బ్యాంకులు, వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్స్ తీసుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. లోన్ తీసుకున్నాక దాన్ని కట్టకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ లోన్లలో ప్రధాన పాత్ర పోషించేది సిబిల్ స్కోర్. సిబిల్ సరిగ్గా లేకపోతే లోన్స్ రావు. మరికొన్ని సంస్థలు లోన్స్ ఇచ్చినా అధిక వడ్డీని వసూల్ చేస్తాయి. అందుకే సిబిల్ స్కోర్ తగ్గకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక లోన్ మొత్తం చెల్లించినప్పుడు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. లోన్ సకాలంలో చెల్లిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. క్రెడిట్ స్కోరు సహజంగా పెరుగుతుంది. మీ క్రెడిట్ హిస్టరీ కూడా బాగుంటుంది. లోన్స్ విషయంలో మీరు క్రమశిక్షణతో ఉన్నారని బ్యాంకులు తెలుసుకుంటాయి. అయితే కొన్నిసార్లు లోన్స్ చెల్లించాక కూడా సిబిల్ స్కోర్ అప్‌డేట్ కాదు. దీంతో కొందరికి ఏం చేయాలో తెలియదు. ఇటువంటి సమయంలో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత, బ్యాంకులు ఆ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు తెలియజేస్తాయి. అది జరగడానికి 30-60 రోజులు పట్టొచ్చు. అందువల్ల మీరు రుణాన్ని చెల్లించిన వెంటనే సిబిల్ స్కోర్ చెక్ చేస్తే మీ రుణం ఇంకా యాక్టివ్‌లోనే ఉంటుంది. రుణాన్ని చెల్లించిన రెండు నెలల తర్వాత క్రెడిట్ స్కోరు చెక్ చేసుకోవాలి. అప్పటికీ అప్‌డేట్ కాకపోతే బ్యాంకు, క్రెడిట్ బ్యూరోను సంప్రదించవచ్చు.
ముందుగా బ్యాంక్ నుండి లోన్ క్లోజర్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. బ్యాంకులు మీరు రుణం చెల్లించినట్లు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తాయి. దాంట్లో లోన్ తీరినట్లు డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోల వెబ్‌సైట్‌కి వెళ్లి వివాద పరిష్కార పోర్టల్‌లో మీ సమస్యను ఫైల్ చేయాలి. దానికి సంబంధిత ఆధారాలను సమర్పించాలి. దాంతో క్రెడిట్ బ్యూరోలు 7 నుండి 21 రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాయి. అప్పుడు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే అప్ డేట్ అవుతుంది.
మీరు రుణం లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంకులు క్రెడిట్ స్కోరు, క్రెడిట్ హిస్టరీని చెక్ చేస్తాయి. ఈ స్కోరు 300 నుండి 900 పాయింట్ల పరిధిలో ఉంటుంది. స్కోరు 800 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులు మీకు లోన్, క్రెడిట్ కార్డులు ఈజీగా ఇచ్చేస్తాయి. ప్రీమియం కార్డులను కూడా పొందవచ్చు. అదే సిబిల్ స్కోర్ 700 కంటే తక్కువగా ఉంటే లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు లోన్ ఇచ్చినా.. అధిక వడ్డీని వసూల్ చేస్తాయి. అందుకే సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..