
మ్యూచువల్ ఫండ్స్.. ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. వీటిల్లో పెట్టుబడికి రిస్క్ ఎక్కువ ఉన్నా అధికశాతం మంది పెట్టుబడికి వెనుకాడటం లేదు. మరి ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ)ల్లో పెట్టుబడులకు సామాన్య మధ్య తరగతి వారు కూడా మొగ్గుచూపుతున్నారు. వీటిల్లో సాధారణ పథకాలతో పోల్చితే మంచి రాబడి వస్తుండటంతో కొన్ని సంవత్సరాలుగా ప్రజాదరణ పొంరుతున్నాయి. మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ ఎన్‌ఏవీలను కొనుగోలు చేయడం మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ కొనుగోలు చేయడం వలన ఎస్‌ఐపీలు లాభదాయకంగా మారుతాయి. ఈ ఎస్‌ఐపీ పెట్టుబడి అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది పెట్టుబడిదారుడిలో పెట్టుబడి క్రమశిక్షణను అభివృద్ధి చేస్తుంది. డబ్బును పొదుపు చేసే అలవాటును ప్రోత్సహిస్తుంది. 100 రూపాయల పెట్టుబడితో దీన్ని ప్రారంభించవచ్చు. పైగా ఈ ఎస్‌ఐపీల్లో ఇతర రకాల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి రకాలతో పోల్చితే తక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాంపౌండింగ్ రాబడి ఉంటుంది. అంతేకాక ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిలో పెట్టుబడులు నిలిపివేయొచ్చు.
విభిన్న రకాల మ్యూచువల్ ఫండ్‌లలో ఎస్‌ఐపీలను ప్రారంభించడం ద్వారా వ్యక్తులు తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను కూడా వైవిధ్యపరచవచ్చు. మీరు మీ పెట్టుబడిని చాలా సంవత్సరాలు ఉంచినట్లయితే, మీ పెట్టుబడి చాలా రెట్లు పెరగడానికి సహాయపడుతుంది. దీర్ఘకాలంలో అధిక రాబడులును ఈ ఎస్‌ఐపీలు అందిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఎస్‌ఐపీలు 12 శాతం సగటును అందిస్తున్నాయి. మీరు సగటున రోజుకు రూ. 200 పెట్టుబడి దీనిలో పెట్టగలిగితే మీరు కొన్ని సంవత్సరాలలోనే కోటీశ్వరులు కావొచ్చు. ఈ నేపథ్యంలో రోజుకు రూ. 200 పెట్టుబడితో 15, 20, 25 సంవత్సరాలలో ఎంత రాబడి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మీకు 25 ఏళ్లు ఉంటే, మీరు ఎస్‌ఐపీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో రోజుకు రూ. 200 ఆదా చేయడం ప్రారంభించారనుకోండి. మీరు ప్రతి సంవత్సరం 12 శాతం సగటు రాబడిని అంచనా వేస్తూ.. ఎస్‌ఐపీ కాలిక్యులేటర్ ప్రకారం, 15 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ. 10,80,000 (రూ. 10.8 లక్షలు) అవుతుంది.
అలాగే 15 సంవత్సరాల తర్వాత, మీరు రూ. 19,47,456 (రూ. 19.50 లక్షలు) మూలధన లాభాలను కలిగి ఉండవచ్చు. అప్పుడు మీ మొత్తం మెచ్యూరిటీ రూ. 30,27,456 (30.3 లక్షలు) అవుతుంది.
మీ వయస్సు 25 సంవత్సరాలు.. 20 సంవత్సరాల పాటు ఎస్‌ఐపీ ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో రోజూ రూ. 200 పెట్టుబడి పెడుతున్నారు; 20 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ. 14,40,000 (రూ. 14.4 లక్షలు) అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత, మీ అంచనా మెచ్యూరిటీ మొత్తం 12 శాతం సగటు వార్షిక రాబడితో రూ. 59,94,888 (59.9 లక్షలు) అవుతుంది. అంటే మీ మూలధన లాభాలు రూ. 45,54,888 (రూ. 45.5 లక్షలు)గా ఉంటాయి.
మీరు మరో 25 సంవత్సరాలకు 25 సంవత్సరాల వయస్సులో రోజుకు రూ. 200 పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీ మెచ్యూరిటీ మొత్తం మిమ్మల్ని సులభంగా కోటీశ్వరునిగా మార్చేస్తుంది. 25 సంవత్సరాలలో, మీ మొత్తం ఎస్‌ఐపీ పెట్టుబడి రూ. 18,00,000 (రూ. 18 లక్షలు) అవుతుంది. 12 శాతం రాబడితో, మీ మూలధన లాభాలు రూ. 95,85,811 (రూ. 95.9 లక్షలు)గా ఉంటాయి. అప్పుడు మీ మెచ్యూరిటీ మొత్తం రూ. 1,13,85,811 (రూ.1.1 కోట్లు) అయ్యే అవకాశం ఉంది. దీనిని మరో విధంగా చెప్పాలంటే 25 ఏళ్ల వయసులో రూ. 200 చొప్పున మీరు ఎస్‌ఐపీలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. మీరు 50 ఏళ్ల వయసుకు వచ్చేసరికి రూ.1.1 కోట్ల సంపాదనతో కోటీశ్వరులుగా మారిపోతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..