ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ప్రభావంతో ఖాళీస్థలాలు లే అవుట్లుగా మారుతున్నాయి. యంత్రాలతో వరి కోతలు చేయడంతో ఎండుగడ్డి అందుబాటులో ఉండడం లేదు. దీంతో పశుపోషణ భారంగా మారిన నేపథ్యంలో అజోల్లా అనేది పాడిరైతులకు వరంగా మారింది. దీన్ని మేతగా తిన్న పశువులు పాలను బాగా ఇస్తున్నాయి. అజోల్లా అంటే ఒక జలచర ఫెర్న్ జాతి. చెరువుల్లో పాటు నీరు కదలకుండా నిల్వ ఉన్న ప్రాంతాలలో ఉపరితలంపై పెరుగుతుంది. దీన్ని పశువులకు పచ్చిమేతలా వేయవచ్చు. అజోల్లాను పెంచడం చాలా సులభం, అలాగే ఖర్చు చాలా తక్కువ అవుతుంది. ముఖ్యంగా దీనిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. దాదాపు 25 నుంచి 30 శాతం జీర్ణమయ్యే ప్రొటీన్ లభిస్తుంది. దీని వల్ల పశువులకు మంచి పౌష్టికాహారం లభించి, పాల దిగుబడి పెరుగుతుంది. అలాగే బీటా కెరోటిన్, విటమిన్ బీ12, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం తదితర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఏడాది పొడవునా అజోల్లాను సాగుచేసుకునే అవకాశం ఉంది.
చెరువులు, నీటి ఉపరితలంపై పెరిగే అజోల్లాను రైతులు తమ పొలంలో కూడా చాలా సులభంగా పెంచుకోవచ్చు. ముందుగా చదునైనా నేలను ఎంచుకోవాలి. దానిలో పది అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పుతో మూడు అడుగుల లోతు గొయ్యి తవ్వాలి. దానిలో 150 జీఎస్ఎం మందం కలిగిన ప్లాస్టిక్ షీట్ ను పరచాలి. అనంతరం గొయ్యిలో నీరు నింపాలి. ఆ నీటిలో మట్టితో పాటు 50 నుంచి 60 గ్రాముల అజోపెర్ట్ ను కలపాలి. మధ్యమధ్యలో నీటిని పిచికారీ చేయాలి, కేవలం ఏడు రోజుల్లోనే అజోల్లా బెడ్ తయారవుతుంది. ఈ బెడ్ నుంచి రోజుకు ఒక కేజీ నుంచి కేజీన్నర వరకూ అజోల్లాను తీయవచ్చు.
అజోల్లా తిన్న పశువులకు పాల దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. గతంలో కంటే 15 నుంచి 20 శాతం ఎక్కువగా పాలను ఇస్తాయి. దీన్ని తయారు చేసుకోవడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఇతర పశుగ్రాసాలతో పోల్చితే ఏడాదికి రూ.30 వేల వరకూ ఆదా చేసుకోవచ్చు. అజోల్లా సక్రమంగా పెరగాలంటే ప్రతి రోజూ ఒక కిలో ఆవు పేడ, ఐదు లీటర్ల నీరు, 50 గ్రాముల అజోపెర్ట్ ద్రావణాన్ని బెడ్ పై చల్లాలి. అలాగే రోజూ మూడు నుంచి నాలుగు రోజులకు శుభ్రమైన నీరు పెట్టాలి. దీని వల్ల అజోల్లా వేగంగా పెరుగుతుంది. దీన్ని పశువులతో పాటు కోళ్లు, బాతులకు కూడా మేతగా పెట్టవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి