కెనటిక్ లునా.. ఈ తరం వారికి ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా 50 ఏళ్ల క్రితం మాత్రం ఈ మోపెడ్ ఓ సెన్సేషన్. ఈ చిన్న స్కూటర్‌ను ఉపయోగించాలని ఎంతో మంది కోరుకునే వారు. లునాను వాడే వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. అంతలా ఈ మోపెడ్ తన ముద్ర వేసింది. 1970లలో దేశీయ ద్విచక్ర వాహనాల విభాగంలో బాగా పాపులర్ అయిన ఈ మోపెడ్ ఇప్పుడు మళ్లీ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కైనటిక్ గ్రూప్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ లూనా వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కైనటిక్ సంస్థ ఈ విషయాన్ని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఎలక్ట్రిక్ మోపెడ్ తయారీలో భాగంగా కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌కు అవసరమైన ఇంజిన్‌తో పాటు ఇతర విడిభాగాల తయారీ ప్రారంభించింది. కైనటిక్ గ్రూప్ అనుబంధ సంస్థ కైనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ ఎలక్ట్రిక్ లూనాలను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో భాగంగానే కైనటిక్ ఇంజనీరింగ్ విభాగం మోపెడ్ తయారీలో ప్రధానమైన స్టాడ్, సైడ్ స్టాండ్ వంటి విడి భాగాలను ఇప్పటికే తయారు చేసిందని కంపెనీ తెలిపింది. ఇదిలా ఉంటే కైనటిక్ ఇంజనీరింగ్ విభాగంలో తయారీకి అవసరమైన ఫ్యాబ్రికేషన్‌తో పాటు ఇతర అప్‌గ్రేడ్‌ల కోసం సంస్థ రూ. 3 కోట్లు కేటాయించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ లూనాల అమ్మకాలు భారీగా ఉంటాయని కైనటిక్ ఎనర్జీ ఎండీ అంజింక్యా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నెలకు 5000 మోపెడ్‌ల తయారీ లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న రెండు నుంచి మూడేళ్ల సమయంలో రూ. 30 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 50 ఏళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చిన లునా రూ. 2 వేల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండేది. ఒకానొక సమయంలో రోజుకు 2000 లునాలను అమ్ముడుపోయాయంటేనే దీని క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ సమయంలో మోపెడ్ విభాగంలో 95 శాతం మార్కెట్‌ను లునాను హస్తగతం చేసుకోవడం విశేషం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..