Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. కొత్త కోచ్‌లు వచ్చేస్తున్నాయ్‌!

మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం 60 కొత్త కోచ్‌లను కొనుగోలు చేయనుంది. BEML సంస్థతో ఈ ఒప్పందం కుదరనుండగా, 15 నెలల్లో కోచ్‌లను సరఫరా చేయగలమని BEML తెలిపింది. ముఖ్యంగా నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ మార్గాల్లో ప్రయాణికుల ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది.

Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. కొత్త కోచ్‌లు వచ్చేస్తున్నాయ్‌!
Metro Rail

Updated on: May 18, 2026 | 9:39 PM

మెట్రో రైళ్లలో రోజురోజుకీ పెరుగుతున్న రద్దీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు సుమారు 60 కొత్త మెట్రో కోచ్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం BEML సంస్థతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం మూడు కారిడార్లలో మొత్తం 56 మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఒక్కో రైలులో మూడు కోచ్‌లు మాత్రమే ఉండటంతో, రద్దీ వేళల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ మార్గాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.

కొత్త కోచ్‌ల కొనుగోలుకు గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. నాగ్‌పూర్ నుంచి కోచ్‌లను లీజుకు తీసుకురావాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది ఆర్డర్ ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమైనా, కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. ఇటీవల మెట్రో ప్రభుత్వం ఆధీనంలోకి రావడంతో కోచ్‌ల కొనుగోలు ప్రక్రియ వేగం అందుకుంది. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML)కు ఆర్డర్ ఇవ్వడానికి సంబంధించిన కసరత్తు తుది దశకు చేరిందని సమాచారం. ఆర్డర్ ఇచ్చిన తేదీ నుంచి 15 నెలల్లో కోచ్‌లను సరఫరా చేయగలమని సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ వారంలోనే మెట్రో సంస్థ, BEML మధ్య ఒప్పందం కుదిరే అవకాశముంది.

2015లో సుమారు రూ.1800 కోట్ల వ్యయంతో Hyundai Rotem సంస్థ నుంచి మెట్రో కోచ్‌లు కొనుగోలు చేశారు. అప్పట్లో దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన డ్రైవర్‌లెస్ సాంకేతికతకు అనుగుణంగా వాటిని రూపొందించారు. ఒక్కో మెట్రో రైలు దాదాపు 965 మంది ప్రయాణికులను ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పుడు అదే సాంకేతికతను BEMLకు అందించేందుకు Hyundai Rotem అంగీకరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఇప్పటికే దేశంలోని పలు నగరాల మెట్రో రైళ్ల కోసం BEML కోచ్‌లను తయారు చేస్తోంది. కొత్త కోచ్‌లు అందుబాటులోకి వస్తే, రద్దీ తగ్గడమే కాకుండా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us