హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ జోరుమీద ఉంది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి సాక్ష్యంగా ఈ డిమాండ్ నిలుస్తోంది. ఇంత వరకూ బెంగళూరులో ఉన్న ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఇప్పుడు హైదరాబద్ లో కనబడుతోంది. మన దేశంలోనే కార్పొరేట్ రంగంలో బెంగళూరు ఆధిపత్యాన్ని ఇప్పుడు హైదరాబాద్ అడ్డుకుంటోంది. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ మార్కెట్ లో దేశంలోనే ప్రథమ స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ కంపెనీ అనరాక్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గత ఆర్ధిక సంవత్సరం అంటే 2022-23లో హైదరాబాద్ లో 14.94 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఇది అంతకు ముందు ఏడాది 2021-22 కంటే 27 శాతం ఎక్కువ. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఆఫీస్ స్పేస్ మొత్తంలో 31 శాతం హైదరాబాద్‌లోనే ఉండటం గమనించ దగ్గ విషయంగా చెప్పవచ్చు.
మరోవైపు ఇప్పటివరకూ కార్పరేట్ రంగంలో ఏకఛత్రాధిపత్యాన్ని కనబరుస్తూ వస్తున్న బెంగళూరు వేగంగా కిందికి జారిపోతోంది. ఇక్కడ 2022-23లో పూర్తయిన ఆఫీస్ స్పేస్ 12.66 మిలియన్ చదరపు అడుగులే. 2021-22తో పోల్చితే ఇది 13 శాతం తక్కువ. అలాగే టాప్-7 నగరాల్లోని స్పేస్‌లో 26%తో సమానం. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై-ఎంఆర్‌ల్లోనూ డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది.
గత ఆర్థిక సంవత్సరం ఆఫీసు అద్దెలు పెరిగాయి. హైదరాబాద్ సహా దేశంలోని టాప్-7 నగరాల్లో ఆఫీస్ రెంటల్స్ 4 శాతం ఎగిసినట్టు అనరాక్ స్పష్టం చేసింది. 2022-23లో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌ల సగటు అద్దె నెలకు చదరపు అడుగుకు రూ.79గా ఉన్నది. నిర్మాణ, తదితర ఖర్చులు పెరగడం వల్లే అద్దెల్ని పెంచుతున్నారని కూడా అనరాక్ వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి