Indian Railways: రైలు ఇంజిన్‌ తయారీ వెనుక దాగి ఉన్న అద్భుత ఇంజనీరింగ్ రహస్యం

Indian Railways: రైల్వే ఇంజిన్‌కు గుండెకాయ లాంటి భాగం 3-ఫేస్ ఏసీ ట్రాక్షన్ మోటార్. ప్రతి మోటార్ నేరుగా ఆక్సిల్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. కరెంట్ లోపలికి వెళ్ళగానే స్టేటార్ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించగా, రోటార్ తిరిగి చక్రాలకు శక్తిని అందిస్తుంది..

Indian Railways: రైలు ఇంజిన్‌ తయారీ వెనుక దాగి ఉన్న అద్భుత ఇంజనీరింగ్ రహస్యం
Train Engine Manufacturing

Updated on: Aug 26, 2026 | 7:53 AM

Indian Railways: గతంలో కాన్పూర్‌ వద్ద రాత్రి సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక రైలు ఇంజిన్ ఒక్కసారిగా కుదుపునకు గురై చక్రాల కింద నుండి మంటలు చెలరేగి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంక్వైరీ రిపోర్టులో కారణం కేవలం రెండు పదాలు: “వీల్ ఫెయిల్యూర్”. వేల టన్నుల బరువును లాగగలిగే శక్తి ఉన్న రైల్వే ఇంజిన్‌లో అంతటి విధ్వంసానికి కారణమయ్యే బలహీనత ఎక్కడ ఉంది? అసలు రైల్వే ఇంజిన్‌ను ఎలా తయారు చేస్తారు? దానిలోని సంక్లిష్టమైన ఇంజనీరింగ్ వివరాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

సాంకేతిక పరిభాషలో రైల్వే ఇంజిన్‌ను లోకోమోటివ్ అంటారు. ఇంజనీర్లు దీని డిజైన్‌ను నెలల తరబడి ప్రణాళిక చేస్తారు. అది ప్యాసింజర్, గూడ్స్ లేదా హైస్పీడ్ రైలు కోసమా అనేది ముందుగానే నిర్ణయించి, అవసరాన్ని బట్టి డిజైన్‌ను మారుస్తారు. ఉదాహరణకు, గూడ్స్ లోకోమోటివ్‌కు ఎక్కువ ట్రాక్షన్ పవర్ అవసరం కాగా, ప్యాసింజర్ ఇంజిన్‌కు వేగం ముఖ్యం. డిజైన్‌ను క్యాడ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి పూర్తి 3D మోడల్‌గా తయారు చేస్తారు. మెయిన్ ట్రాన్స్‌ఫార్మర్, ట్రాక్షన్ మోటార్, డ్రైవర్ క్యాబిన్ వంటి భాగాల అమరికను ఈ దశలోనే ఖరారు చేస్తారు. డిజైన్‌లో చిన్న తప్పు కూడా మొత్తం ఇంజిన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది.

ఇది కూడా చదవండి: MG EV: సింగిల్‌ ఛార్జింగ్‌తో 550 కిలోమీటర్ల రేంజ్.. పవర్‌ఫుల్‌ 7 సీటర్‌ కారు!

డిజైన్ పూర్తయ్యాక, ఇంజిన్ బాడీని తయారు చేసే పని మొదలవుతుంది. ఇంజిన్ కింది భాగంలో ఉండే మెయిన్ పార్ట్‌ను అండర్‌ఫ్రేమ్ అంటారు. ఇది మొత్తం బరువును మోస్తుంది. అందుకే దీన్ని హై-టెన్సైల్ స్టీల్‌తో అత్యంత పటిష్టంగా నిర్మిస్తారు. పెద్ద స్టీల్ ప్లేట్లను సీఎన్‌సీ ప్లాస్మా కటింగ్ మెషిన్ ద్వారా కట్ చేసి, మిగ్ వెల్డింగ్, రోబోటిక్ వెల్డింగ్ ద్వారా అతికిస్తారు. వెల్డింగ్ నాణ్యతను నిర్ధారించడానికి ప్రతి జాయింట్‌ను అల్ట్రాసోనిక్ టెస్టింగ్ చేస్తారు. ఆ తరువాత తుప్పు పట్టకుండా యాంటీ-కొరిజిన్ కోటింగ్ వేస్తారు.

ఇంజిన్‌కు కీలకమైన భాగాలలో చక్రాలు, ఆక్సిల్, బోగీ సిస్టమ్ ఒకటి. చక్రాలను కలిపే మందపాటి స్టీల్ రాడ్‌లను ఆక్సిల్ అంటారు. ఈ చక్రాలు, ఆక్సిల్, సస్పెన్షన్‌తో కూడిన పూర్తి నిర్మాణాన్ని బోగీ అంటారు. ఇంజిన్ సమతుల్యత దీనిపైనే ఆధారపడి ఉంటుంది. చక్రాలను ఫోర్జ్‌డ్ అల్లాయ్ స్టీల్‌తో తయారు చేస్తారు. స్టీల్‌ను 1200 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసి, హైడ్రాలిక్ ఫోర్సింగ్ ప్రెస్ ద్వారా ఆకారం ఇస్తారు. సీఎన్‌సీ లేత్ మెషిన్ ద్వారా ఖచ్చితంగా కట్ చేసి, గట్టిదనం, ఫ్లెక్సిబిలిటీ కోసం హీట్ ట్రీట్‌మెంట్ చేస్తారు.

రైల్వే ఇంజిన్‌కు గుండెకాయ లాంటి భాగం 3-ఫేస్ ఏసీ ట్రాక్షన్ మోటార్. ప్రతి మోటార్ నేరుగా ఆక్సిల్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. కరెంట్ లోపలికి వెళ్ళగానే స్టేటార్ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించగా, రోటార్ తిరిగి చక్రాలకు శక్తిని అందిస్తుంది. అయితే, వేలాది ఆంపియర్ల కరెంట్ ప్రవాహం వల్ల మోటార్‌లో విపరీతమైన వేడి పుడుతుంది. దీన్ని నియంత్రించడానికి కూలింగ్ బ్లోవర్లు, కొన్ని ఇంజిన్లలో ఆయిల్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు.

ఇంత భారీ ఎలక్ట్రిసిటీ ఇంజిన్‌కు ఎలా చేరుతుందంటే, పాంటోగ్రాఫ్ ద్వారా. ఇంజిన్ పైభాగంలో అమర్చిన ఈ మెకానికల్ ఆర్మ్ 25 కేవీ ఓవర్‌హెడ్ వైర్ల నుండి కరెంటును గ్రహిస్తుంది. ఈ ఓవర్‌హెడ్ క్యాటనరీ సిస్టమ్‌లోని వైర్‌ను పాంటోగ్రాఫ్‌లోని కార్బన్ స్ట్రిప్ స్పృశిస్తూ ఉంటుంది. అయితే, ఇంత హై వోల్టేజ్ కరెంట్ నేరుగా మోటార్‌లోకి వెళ్ళదు. మెయిన్ ట్రాన్స్‌ఫార్మర్ వోల్టేజ్‌ను తగ్గించి, ట్రాక్షన్ కన్వర్టర్‌కు పంపుతుంది. ఈ కన్వర్టరే విద్యుత్‌ను పూర్తిగా నియంత్రిస్తుంది. మోటార్‌కు ఎంత పవర్ వెళ్ళాలి, యాక్సిలరేషన్, బ్రేక్ వంటివి దీని ద్వారా నిర్ణయించబడతాయి. ఆధునిక ఇంజిన్లలో ఐజీబీటీ (IGBT) టెక్నాలజీని వాడుతున్నారు.

ఇది కూడా చదవండి: Electric Scooter: ఓలా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 320 కి.మీ రేంజ్, ధర ఎంతంటే?

రైల్వే ఇంజిన్‌లో వేలాది ఎలక్ట్రిక్ కనెక్షన్లు ఉంటాయి. వీటిని ఎలక్ట్రికల్ హర్నెస్ అంటారు. షార్ట్ సర్క్యూట్‌లను నివారించడానికి ప్రతి వైర్‌ను హీట్ రెసిస్టెంట్ మెటీరియల్‌తో కవర్ చేస్తారు. టెంపరేచర్, ప్రెషర్, స్పీడ్, వైబ్రేషన్ సెన్సార్లు ఇంజిన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తాయి.

6000 టన్నుల బరువున్న రైలును ఆపడానికి ఎయిర్ బ్రేక్ సిస్టమ్, డైనమిక్ బ్రేకింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తారు. ఎయిర్ కంప్రెషర్ హై ప్రెషర్ గాలిని ఉత్పత్తి చేయగా, అది బ్రేక్ పైపుల ద్వారా ప్రసరించి బ్రేక్ షూ వీల్‌కు అతుక్కుంటుంది. డైనమిక్ బ్రేకింగ్‌లో ట్రాక్షన్ మోటార్ జనరేటర్‌గా పనిచేసి రైలు వేగాన్ని తగ్గిస్తుంది. డ్రైవర్ క్యాబిన్‌లో మాస్టర్ కంట్రోలర్, బ్రేక్ హ్యాండిల్, డిజిటల్ డిస్‌ప్లే యూనిట్, విజిలెన్స్ కంట్రోల్ సిస్టమ్ (వీసీఎస్) ఉంటాయి. వీసీఎస్ డ్రైవర్ యాక్టివిటీని పర్యవేక్షించి, అవసరమైతే ఆటోమేటిక్‌గా బ్రేక్స్ అప్లై చేస్తుంది. కొత్త ఇంజిన్లలో టీసీఎంఎస్ (ట్రైన్ కంట్రోల్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ఒక కంప్యూటరైజ్డ్ బ్రెయిన్‌లా పనిచేస్తూ ప్రతి సిస్టమ్‌ను పర్యవేక్షిస్తుంది.

అన్ని భాగాలు తయారయ్యాక, క్రేన్ల సహాయంతో ట్రాక్షన్ మోటార్, మెయిన్ ట్రాన్స్‌ఫార్మర్, కంప్రెషర్, కన్వర్టర్ క్యాబినెట్ వంటి భారీ భాగాలను జాగ్రత్తగా అసెంబుల్ చేస్తారు. ఆ తరువాత పూర్తి వైరింగ్ చేసి, మొదటిసారిగా ఇంజిన్‌కు పవర్ ఇస్తారు. దీని తర్వాత కఠినమైన టెస్టింగ్ దశ ఉంటుంది. లోడ్ టెస్ట్, బ్రేక్ టెస్ట్, హై వోల్టేజ్ టెస్ట్, వైబ్రేషన్ టెస్ట్, థర్మల్ టెస్ట్ వంటి అనేక పరీక్షలు నిర్వహిస్తారు. అన్నీ విజయవంతం అయ్యాకే ఇంజిన్‌ను ట్రాక్ మీద ట్రయల్ రన్‌కు పంపుతారు. భారీ లోడ్‌తో, ప్రతి సెకను డేటాను మానిటర్ చేస్తూ వేగాన్ని పెంచుకుంటూ పోతారు. రైల్వే ప్రపంచంలో జరిగే ఒక చిన్న తప్పు కూడా వందలాది ప్రాణాలను బలిగొంటుంది. అందుకే రైల్వే లోకోమోటివ్ తయారీ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన, సున్నితమైన పనులలో ఒకటి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us