AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకు అకౌంట్ లేకున్నా గూగుల్ పేతో పైసలు పంపొచ్చు.. ఎలా అంటే..?

Google Pay Pocket Money: బ్యాంకు ఖాతా ఉంటేనే యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఇది ఇప్పటివరకు మనందరికీ తెలిసిన రూల్.. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. మీ దగ్గర బ్యాంకు అకౌంట్ లేకపోయినా, మీరు గూగుల్ పే ద్వారా చిటికెలో పేమెంట్స్ చేయొచ్చు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా..? గూగుల్ పే తీసుకొచ్చిన సరికొత్త యాప్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాంకు అకౌంట్ లేకున్నా గూగుల్ పేతో పైసలు పంపొచ్చు.. ఎలా అంటే..?
Google Pay Pocket Money Feature
Krishna S
|

Updated on: Apr 26, 2026 | 6:41 PM

Share

మన దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులే. ఫోన్ పే, గూగుల్ పే వచ్చాక నగదు వాడకమే లేకుండా పోయింది. అయితే ఇప్పటి వరకు ఉన్న ఒకే ఒక్క నిబంధన ఏంటంటే.. యూపీఐ ద్వారా డబ్బులు పంపాలన్నా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్నా ఖచ్చితంగా బ్యాంకు ఖాతా ఉండాలి. కానీ దేశంలోని అత్యధిక శాతం మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు, విద్యార్థులకు సొంతంగా బ్యాంకు అకౌంట్స్ ఉండవు. ఈ అడ్డంకిని తొలగిస్తూ టెక్ దిగ్గజం గూగుల్ పే ఒక సంచలన ఫీచర్‌ను తీసుకువచ్చింది. అదే పాకెట్ మనీ.

ఏమిటీ పాకెట్ మనీ ఫీచర్..?

ఈ ఫీచర్ ద్వారా ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతాను మరొకరి గూగుల్ పే ఖాతాకు లింక్ చేయవచ్చు. అంటే అకౌంట్ ఉన్న వ్యక్తి తన ఖాతా నుంచి కొంత యాక్సెస్‌ను అకౌంట్ లేని వ్యక్తికి ఇస్తాడు. తద్వారా రెండో వ్యక్తి తన ఫోన్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసినా ఆ సొమ్ము మాత్రం మొదటి వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచే డెబిట్ అవుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరికీ సొంత అకౌంట్ ఉండాలనే నిబంధన లేకుండానే డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

ఈ ఫీచర్‌ను సెటప్ చేయడం ఎలా..?

ఈ ప్రక్రియ చాలా సులభంగా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

అకౌంట్ ఉన్నవారు: మీ గూగుల్ పే యాప్‌లోకి వెళ్లి.. పాకెట్ మనీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ కాంటాక్ట్ లిస్ట్ నుండి ఎవరినైతే లింక్ చేయాలనుకుంటున్నారో వారి నంబర్‌ను సెలెక్ట్ చేయాలి.

అకౌంట్ లేనివారు: మీరు ఎంపిక చేసిన వ్యక్తి ఫోన్‌లో కూడా గూగుల్ పే యాప్ ఉండాలి. వారికి ఒక ఇన్విటేషన్ లింక్ వెళ్తుంది, దానిని వారు యాక్సెప్ట్ చేయాలి.

రిలేషన్‌షిప్: సెటప్ చేసే సమయంలో సదరు వ్యక్తితో మీకు ఉన్న రిలేషన్ ఏంటో చెప్పాలి.

లిమిట్ సెట్టింగ్: ఒక నెలలో వారు గరిష్టంగా ఎంత ఖర్చు చేయవచ్చో మీరు ముందే నిర్ణయించవచ్చు.

భద్రత – నియంత్రణ

డబ్బు మీ అకౌంట్ నుంచి పోతుంది కాబట్టి, గూగుల్ పే ఇందులో పూర్తి కంట్రోల్‌ను మీకు ఇచ్చింది.

  • మీ అకౌంట్‌ను వాడుతున్న వ్యక్తి ఎక్కడ, ఎంత ఖర్చు చేస్తున్నారో మీ యాప్‌లో రియల్ టైమ్ నోటిఫికేషన్లు వస్తాయి.
  • ప్రతి పేమెంట్‌ను మీరు మీ ఫోన్ నుంచే యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయవచ్చు.
  •  నెలకు గరిష్టంగా 15,000 రూపాయల వరకు మాత్రమే ఈ ఫీచర్ ద్వారా ఖర్చు చేసే వీలుంది. ఇది అనవసర ఖర్చులను నియంత్రించడానికి తోడ్పడుతుంది.

ఈ ఫీచర్ ఎవరికి బెస్ట్..?

తల్లిదండ్రులకు: బ్యాంకు పనుల గురించి పెద్దగా తెలియని వృద్ధులకు, వారి పిల్లలు తమ అకౌంట్‌ను లింక్ చేయడం ద్వారా వారు చిన్న చిన్న షాపింగ్ అవసరాలకు ఇబ్బంది పడకుండా ఉండొచ్చు.

విద్యార్థులకు: కాలేజీ విద్యార్థులకు పాకెట్ మనీ ఇచ్చే తల్లిదండ్రులు, ఈ ఫీచర్ ద్వారా పిల్లలు ఎలా ఖర్చు చేస్తున్నారో పర్యవేక్షిస్తూనే వారికి డబ్బులు అందజేయవచ్చు.

గృహిణులకు: సొంతంగా అకౌంట్ లేని గృహిణులు ఇంటి అవసరాల కోసం భర్త అకౌంట్‌ను లింక్ చేసుకుని పేమెంట్స్ చేసుకోవచ్చు.

డిజిటల్ ఇండియా లక్ష్యంలో ఇదొక గొప్ప ముందడుగు. బ్యాంకు అకౌంట్ అనే అడ్డంకిని తొలగించడం ద్వారా అట్టడుగు స్థాయి వరకు డిజిటల్ చెల్లింపులు చేరువవుతాయి. అయితే, లింక్ చేసేటప్పుడు నమ్మకస్తులైన కుటుంబ సభ్యులను మాత్రమే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us