
నేటి కాలంలో బ్యాంకుల నుండి పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా వాహన రుణం తీసుకోవాలంటే అత్యంత కీలకమైనది క్రెడిట్ స్కోరు. మీ క్రెడిట్ స్కోరు బాగుంటేనే బ్యాంకులు మిమ్మల్ని నమ్మి లోన్ ఇస్తాయి. ఒకవేళ స్కోరు తక్కువగా ఉంటే లోన్స్ రావడం చాలా కష్టం. వచ్చినా ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. మరి మీ క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకుని, ఆర్థిక క్రమశిక్షణను ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
క్రెడిట్ స్కోరు అనేది మీరు గతంలో తీసుకున్న అప్పులను ఎంత బాధ్యతగా తిరిగి చెల్లించారో తెలిపే ఒక కొలమానం. మీరు తీసుకున్న క్రెడిట్ కార్డు బిల్లులు లేదా బ్యాంక్ లోన్ EMIలను గడువు తేదీ కంటే ముందే చెల్లించడం అలవాటు చేసుకోవాలి. ఒక్క నెల వాయిదా తప్పినా అది మీ క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సకాలంలో చెల్లింపులు చేసే వ్యక్తిని బ్యాంకులు నమ్మదగ్గ కస్టమర్‌గా పరిగణిస్తాయి.
మీకు ఎంత లోన్ అమౌంట్ అందుబాటులో ఉంది. మీరు అందులో ఎంత ఉపయోగిస్తున్నారు అనేది కూడా మీ స్కోరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులు తమకు ఉన్న లిమిట్ మొత్తాన్ని వాడేయకూడదు. రుణ మొత్తాన్ని వివిధ అవసరాలకు సముచితంగా విభజించి వాడుకోవడం వల్ల మీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. తద్వారా క్రెడిట్ స్కోరు తగ్గకుండా ఉంటుంది.
చాలామంది చేసే తప్పు ఏమిటంటే.. లోన్ అవసరమైనప్పుడే క్రెడిట్ స్కోరును చూస్తారు. కానీ కనీసం ఏడాదికి ఒకసారి మీ క్రెడిట్ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. మీరు చెల్లించేసిన లోన్ ఇంకా ఆక్టివ్ అని చూపిస్తుందా? మీ పేరు మీద మీకు తెలియని లోన్లు ఏమైనా ఉన్నాయా?, బ్యాలెన్స్ మొత్తంలో ఏవైనా తప్పులు ఉన్నాయా? వంటి లోపాలు ఉంటే వెంటనే సంబంధిత క్రెడిట్ ఏజెన్సీని సంప్రదించి ఫిర్యాదు చేయాలి. పొరపాట్లను సరిదిద్దుకోవడం వల్ల సహజంగానే మీ స్కోరు పెరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి