పెట్రోల్, డిజీల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. సామాన్యుడు లీటరు పెట్రోల్ ఖర్చ బరించలేని స్థాయికి చేరుకున్నాడు. పెట్రోలు ఎప్పుడో లీటరు వంద దాటగా, ఇప్పుడు డీజిల్ వందకు చేరువయింది. ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుదామంటే మెయింటెన్స్‌పై అనేక సందేహాలు. ఈవీలను ఛార్జింగ్ చేస్తే ఎంత ఖర్చు వస్తుందనే అంశంపై క్లారిటీ లేదు. ఈ సందేహాలకు చెక్ పెట్టింది కేరళ సర్కారు. వేగంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించడంతో పాటు అక్కడ ఛార్జింగ్ ధరలను కూడా ప్రకటించింది.
ప్రపంచమంతా వేగంగా పెట్రోలు, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు షిఫ్ట్ అయిపోతోంది. ఇండియాలోనూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఈవీ పాలసీలు తెస్తున్నాయి. అయితే వాహనాలు కొనడం తేలికే కానీ పెట్రోలు బంకుల తరహాలో ఈవీ వాహనాల ఛార్జింగ్ పాయింట్లే ఇప్పుడు ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ఈ ఇబ్బందిని వేగంగా అధిగమించేందుకు కేరళ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచే దిశగా కేరళ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తోంది. రవాణా శాఖ నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఏ నగరంలో ఉంటే అక్కడ వెనువెంటనే ఛార్జింగ్ పాయింట్లను నిర్మించాలని నిర్ణయించింది.
దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని జాతీయ రహదారుల వెంట ఈ పబ్లిక్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ యూనిట్లు రానున్నాయి. ఛార్జింగ్ స్టేషన్ల స్థాపనకు ప్రైవేటు సంస్థలకే కేరళ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనులు చేపట్టడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఒక్క ప్రభుత్వ రంగంలోనే వందకు పైగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాబులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది
ధర ఎంత అంటే..?
పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లో తమ వాహనాలను ఛార్జ్ చేసుకున్నందుకు గాను యూనిట్‌కి రూ. 15వంతున ఛార్జ్ చేయాలని కేరళా ఎలక్ట్రిసిటీ బోర్డు నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో ఈ ధర ఇంచుమించు రూ.22గా ఉంది. ఇక ప్రైవేటు రంగంలోని ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించి ఒక యూనిట్ కరెంటుకు రూ.5 ఎలక్ట్రిసిటీ బోర్డు ఛార్జ్ చేస్తుంది. ఇన్‌ఫ్రా, ఇతర ఖర్చులు పోను ప్రైవేటు ఛార్జింగ్ స్టేషన్లలో కూడా రూ. 15లకే అటుఇటుగా వినియోగదారులు తమ వాహనాలు ఛార్జ్ చేసుకునేలా కేరళా సర్కారు జాగ్రత్తలు తీసుకుంటోంది. కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డులో ప్రస్తుతం వినియోగంలో ఉన్న పెట్రోలు, డీజీల్‌లతో నడిచే ఐసీఈ వాహనాలను తుక్కు కింద అమ్మేస్తున్నారు. వాటి స్థానంలో కొత్తగా ఈవీ వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. అద్దె ప్రతిపాదికన సంస్థలో ఉపయోగిస్తున్న వాహనాలకు ఇదే నిబంధన అమలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడంలో కేరళా సర్కారు మిగిలిన రాష్ట్రాల కంటే ముందే చర్యలు ప్రారంభించింది.
Read Also.. Spicejet: విమానం పార్కింగ్ ఫీజు రూ.5.5 కోట్లు.. ఎక్కడో తెలుసా..