
గతంలో పిల్లలు సరిగ్గా చదవకుండా అల్లరి చిల్లరిగా తిరిగితే పెద్దలు మందలించేవారు. చదువుకోకపోతే పొలం పని చేసుకుని కష్టబడి బతకాలంటూ తిట్టేవారు. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. అది చేసుకుంటే చాలు జీవితం సాఫీగా సాగిపోతుందని వారి ఉద్దేశం. వ్యవసాయం చేయడం కష్టమని, ఆదాయం కూడా చాలా తక్కువ రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదువుతాయని చెప్పేవారు. అయితే నేడు చాలామంది విద్యావంతులు వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగం చేస్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నా, వ్యవసాయానికే ఓటు వేస్తున్నారు. తమ చదువును, తెలివితేటలను ఉపయోగించి వ్యవసాయంలో లాభాలు గడిస్తున్నారు. తమకు ఉద్యోగంలో వచ్చే జీతం కన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడినా.. వ్యవసాయంపై ఆసక్తితో సేంద్రియ సాగు ప్రారంభించి రూ. లక్షలు ఆర్జిస్తున్న ఓ దంపతుల విజయగాథ ఇది.
ఆ దంపతులిద్దరూ ఉన్నత విద్యావంతులు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిద్దరి జీవితం సాఫీగా గడిచిపోతోంది. అయితే ఉన్నట్టుండి వ్యవసాయం చేసి పంటలను పండించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి చూపారు. వెంటనే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఎంతో ఇష్టంతో కష్టబడి పనిచేసి స్ట్రాబెర్రీ సాగులో మంచి దిగుబడులు సాధించారు. తమ చుట్టు పక్కల ప్రాంతంలోని రైతులకు కూడా ఈ సాగులో మెలకువలు చెప్పే స్థాయికి ఎదిగి ఆదర్శంగా నిలిచారు.
హింగన్‌ఘాట్ తాలూకాలోని కన్హోలి కత్రికి చెందిన మహేష్ పాటిల్, భారతీ పాటిల్ భార్యాభర్తలు. వీరిద్దరూ ఉన్నత విద్యావంతులు. ఈ దంపతులిద్దరూ ఇటీవల మహాబలేశ్వర్ ను సందర్శించారు. అక్కడ పండుతున్న స్ట్రాబెర్రీలను చూసి ముచ్చటపడ్డారు. తాము కూడా వాటిని సాగుచేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి, ఆ సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి సాగు మెలకువలను తెలుసుకున్నారు. స్ట్రాబెర్రీలకు మహాబలేశ్వర్ ఎంతో ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో అనుసరిస్తున్న సాగు విధానాలను అధ్యయనం చేశారు.
తాము నివసించే వార్దాలో స్ట్రాబెర్రీలు పండించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అవి చల్లటి వాతావరణంలో పండుతాయి. కానీ వార్దాలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా ఈ దంపతులు వెనకడుగు వేయలేదు. ముందుగా తాము చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. పూర్తి సమయం వ్యవసాయానికి కేటాయించారు. స్ట్రాబెర్రీ సాగును మొదలు పెట్టారు. వాతావరణ వైవిధ్యం కారణంగా అనేక ఆధునిక పద్ధతులు అమలు చేశారు. చివరకు విజయం సాధించారు. వార్దాలో స్ట్రాబెర్రీలను విజయవంతంగా పండించారు.
ఈ దంపతులు తమ తొలి ప్రయోగంలో భాగంగా 1.25 ఎకరాల్లో పదివేల స్ట్రాబెర్రీ మొక్కలను నాటారు. ఆధునిక పద్ధతులు పాటించడంతో దిగుబడి బాగా వచ్చింది. వాటిని విక్రయించగా పెట్టుబడి పోను సుమారు 1.50 లక్షల లాభం సంపాదించారు. ఈ విజయం వారికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. వెంటనే తమ సాగును విస్తరించారు. ఈ ఆగస్టులో సుమారు 5 ఎకరాల్లో స్ట్రాబెర్రీ మొక్కలను నాటారు. దానికి దాదాపు రూ.20 లక్షల వరకూ పెట్టుబడి అయ్యింది. పంట ఆశాజనంగా ఉంది. దిగుబడి వచ్చిన తర్వాత పంటను విక్రయిస్తే సుమారు రూ.60 లక్షల నుంచి రూ.65 లక్షల వరకూ వస్తుందని భావిస్తున్నారు. తమ పెట్టుబడి రూ.20 లక్షలు పోగా రూ. 40 లక్షల నుంచి రూ.45 లక్షలు లాభం తీయవచ్చని అంచనా వేశారు.
ఒకప్పుడు వ్యవసాయం అంటే ఏమిటో తెలియని మహేష్ పాటిల్, భారతీ పాటిల్ ఇప్పుడు ఆదర్శ రైతులుగా గుర్తింపు పొందారు. తమ ప్రాంతలో రైతులకు సాగులో సలహాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. స్ట్రాబెర్రీ సాగులో సాధించిన విజయంతో వార్తల్లో నిలిచారు. దీంతో జిల్లా యంత్రాంగం అభినందించింది. ఇతర రైతులను కూడా స్ట్రాబెర్రీ సాగులో ప్రోత్సహించింది. వార్ధా జిల్లాలో మొత్తం ఎనిమిది మంది రైతులు 11 ఎకరాల భూమిలో సమష్టిగా వీటిని పండించారు. మహాబలేశ్వర్ లో పండిన వాటికన్నా రుచికరమైన స్ట్రాబెర్రీలు ఇప్పుడు వార్దాలో లభిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..