Hero MotoCorp: వాహన రంగాలలో అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతుంటే.. వాహనాల ధరలు సైతం పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో విక్రయాలు తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం కరోనా తగ్గిపోవడంతో మళ్లీ వ్యాపారాలు జోరందుకున్నాయి. అందుకు ముడి సరుకుల ధరలు పెరుగుతున్న కారణంగా ధరలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా
ద్విచక్ర వాహన తయారీ దేశీయ దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్ తమ అన్ని మోడళ్ల ధరలను రూ.3,000 వరకు పెంచనున్నట్లు గురువారం వెల్లడించింది.
ఈ నెల 20 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. ముడి పదార్థాలు, కమొడిటీ ధరలు పెరిగిన నేపథ్యంలోనే వాహనాల ధరలు పెంచాల్సి వస్తోందని వెల్లడించింది. అన్ని మోడళ్ల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై రూ.3,000 వరకు ధర పెంచుతామని ప్రకటించిన కంపెనీ.. ఏ మోడల్‌కు ఎంత పెంచేదీ వెల్లడించలేదు. మోడల్, మార్కెట్ ఆధారంగా పెంపు ఉంటుందని తెలిపింది. గత జనవరిలో రూ.1,500 వరకు, ఏప్రిల్‌లో రూ.2,500 వరకు కంపెనీ వాహనాల ధరలు పెంచిన సంగతి తెలిసిందే.
వాహనాల తయారీకి వాడే పలు రకాల విడిభాగాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లో పండగ సీజన్ అయినప్పటికీ వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీ అభిప్రాయపడింది. అయితే పండగ సీజన్‌లో డిమాండ్ ఆశించిన స్థాయిలోనే ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హీరో మోటోకార్ప్ తొలి ఐదు నెలల కాలంలో మొత్తం 18 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇది గత ఏడాది నమోదైనదానికంటే 12 శాతం అధికమని కంపెనీ వెల్లడించింది.