
ఈ-కేవైసీ ఇటీవల కాలంలో అందరి నోటి వెంట వినిపిస్తున్న పదం. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా, బ్యాంకు లావాదేవీలనా కేవైసీ( నో యువర్ కస్టమర్) తప్పనిసరి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కూడా దీనిని విధిగా చేయాలని ఆదేశించింది. ఆర్థిక కార్యకలాపాలు ఇబ్బంది లేకుండా భద్రంగా ఉండేలా దీనిని నిర్వహించాలని సూచించింది. అయితే గతంలో ఇది పూర్తి చేయాలంటే బ్యాంకు బ్రాంచ్ వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు దానిని ఆర్బీఐ మరింత సులభతరం చేసింది. ఆన్ లైన్ లోనే కేవైసీ అప్ డేట్ చేసుకొనే అవకాశాన్ని కల్పలించింది. ఇప్పటికే కేవైసీ పత్రాలు బ్యాంకులో సమర్పించిన వారు వారి కేవైసీ వివరాలను ఆన్ లైన్ లోనే అప్ డేట్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
గత సంవత్సరం వరకు కేవైసీని అప్‌డేట్ చేయాలంటే బ్యాంక్ బ్రాంచ్ ను సందర్శించాల్సి ఉండేది. అయితే, జనవరి 5, 2023 నుంచి కేవైసీ సమాచారంలో మార్పులు లేకుంటే, వినియోగదారులు వారి ఈ- మెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఏటీఎం లేదా డిజిటల్ చానెల్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. కేవైసీ సమాచారంలో ఎటువంటి మార్పు లేకుంటే, ఈ సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని వివరించింది. ఈమేరకు బ్యాంకులకు డైరెక్షన్ ఇచ్చింది. బ్యాంక్ బ్రాంచ్ ఆఫీసులను సందర్శించకుండా రిజిస్టర్డ్ ఇమెయిల్-ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఏటీఎంలు, డిజిటల్ ఛానెల్‌లు (ఆన్‌లైన్ బ్యాంకింగ్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్) వంటి వివిధ ఛానెల్‌ల ద్వారా వ్యక్తిగత ఖాతాదారులకు సెల్ఫ్ డిక్లరేషన్ చేసేలా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. చిరునామా మార్పు విషయంలో, కస్టమర్‌లు సవరించిన లేదా నవీకరించబడిన చిరునామాను ఈ ఛానెల్‌లలో దేని ద్వారానైనా అందించవచ్చని పేర్కొంది. తదనంతరం, బ్యాంక్ కొత్తగా ప్రకటించిన చిరునామాను రెండు నెలల వ్యవధిలో ధృవీకరిస్తుంది.
కేవైసీ అనేది బ్యాంకులు తమ కస్టమర్‌ల గుర్తింపులు, చిరునామాలకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రక్రియ. ఈ సేకరించిన సమాచారం కస్టమర్ గుర్తింపును నిర్ధారించడానికి, వారి ప్రమాద స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. బ్యాంకుల సేవల దుర్వినియోగాన్ని నిరోధించడంలో కేవైసీ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. ఖాతా తెరవడం ప్రారంభించేటప్పుడు బ్యాంకులకు కేవైసీ విధానం తప్పనిసరి. ఇది తరచూ అప్ డేట్ చేస్తూ ఉండాలి. మీ కేవైసీ సమాచారాన్ని అప్‌డేట్ చేయడంలో విఫలమైతే లావాదేవీలపై పరిమితులు లేదా మీ బ్యాంక్ ఖాతా తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..