దేశంలో అతి పెద్ద ఇన్సురెన్స్ కంపెనీ ఎల్ఐసీ. దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎప్పుడు ఎల్ఐసీ నుంచి ఏ ప్లాన్ గురించిన ప్రకటన వచ్చినా ఆసక్తి కనబరుస్తారు. అందుకుతగ్గట్టుగానే పలు రకాల ఇన్సురెన్స్ పాలసీలను ఎల్ఐసీ ప్రకటిస్తుంటుంది. వ్యక్తగత అవసరాలకు తీర్చే విధంగా, టెర్మ్ ఇన్సురెన్స్, ఎండోమెంట్ ప్లాన్స్, మనీ బ్యాక్ పాలసీలు, జీవిత బీమా, యూనిట్ లింక్డ్ ప్లాన్స్(యూఎల్ఐపీ) వంటి రకరకాల పాలసీలు ఎల్ఐసీ అందిస్తుంది. అలాగే పిల్లల కోసం, పెద్దల రిటైర్మెంట్ ప్లాన్లు, గ్రూప్ ఇన్సురెన్స్ వంటి అనేక స్కీమ్లు తీసుకొస్తుంది. వాటిల్లో ఒక పథకమైన ఎల్ఐసీ ధన్ రేఖ పాలసీ గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఎల్ఐసీ ధన్ రేఖ అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, జీవిత బీమా ప్లాన్. ఇది పొదుపుతో పాటు రక్షణను అందిస్తుంది. పాలసీ వ్యవధి ముగియకుండానే పాలసీదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఈ ప్లాన్ ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఈ పాలసీలో నిర్ధేశిత వ్యవధిలో చెల్లింపులు చేయవచ్చు. పాలసీ టెర్మ్ ముగిసిన తర్వాత పాలసీదారుడుకి ఇకేసారి పెద్ద మొత్తంలో నగదు వస్తుంది. ఈ పాలసీలో రుణ సదుపాయం కూడా ఉంది. ఈ పాలసీ తీసుకోవాలనుకొనే వారు ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ నుంచి అన్ని స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్లు క్షుణ్ణంగా చదివి, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.
90 రోజుల వయసు ఉన్న చిన్న పిల్లల దగ్గరి నుంచి పాలసీ తీసుకోవచ్చు. గరిష్టంగా 55 ఏళ్ల వయసు ఉన్న వారు పాలసీ పొందేందుకు అర్హులు. 20 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల పాలసీ టర్మ్‌తో ధన్ రేఖ పాలసీ తీసుకోవచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న టర్మ్ ప్రాతిపదికన మీరు ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు 20 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే మీరు పదేళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. అదే 30 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ఇక మీరు 40 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంపిక చేసుకుంటే అప్పుడు 20 ఏళ్లు ప్రీమియం కడుతూ వెళ్లాలి. ఈ ఆప్షన్స్ మాత్రమే కాకుండా సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా ఒకటి అందుబాటులో ఉంది.
ప్రయోజనాలు ఇవి..
డెత్ బెనిఫిట్.. ఈ పాలసీ ప్రారంభించి, మధ్యలోనే పాలసీదారుడు మరణిస్తే మరణ ప్రయోజనం మొత్తం నామినీకి అందిస్తారు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీదారులకు ప్రాథమిక హామీ మొత్తంపై 125శాతం అధికంగా నగదు చెల్లిస్తారు. అలాగే లిమిటెడ్ ప్రీమియం వారికి ప్రాథమిక హామీ మొత్తంలో 125శాతం లేదా వార్షిక ప్రీమియంకు 7 రెట్లు.. ఈ రెండింటిలో ఏది ఎక్కువయితే దానిని ఇస్తారు. లిమిటెడ్ ప్రీమియంలో అందించే డెత్ బెనిపిట్ అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియం కంటే తప్పనిసరిగా 105శాతానికి తక్కువ కాకుండా ఉండాలి.
మెచ్యూరిటీ బెనిఫిట్.. పాలసీ టర్మ్ ముగిసిన తర్వాత హామీ ఇచ్చిన మొత్తాన్ని అందిస్తారు.
సర్వైవల్ బెనిఫిట్.. 20 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే.. పాలసీ తీసుకున్న పదో ఏటా, 15 ఏటా బీమా మొత్తంలో 10 శాతం డబ్బులు చెల్లిస్తారు. అదే 30 ఏళ్ల టర్మ్ అయితే 15వ ఏటా, 20వ ఏటా, 25వ ఏటా బీమా మొత్తంలో 15 శాతం చొప్పున ఇస్తారు. అదే 40 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే.. 20వ ఏటా, 25వ ఏటా, 30వ ఏటా, 35వ ఏటా బీమా మొత్తంలో 20 శాతం చొప్పున చెల్లిస్తారు.
గ్యారంటీడ్ అడిషన్స్.. బకాయి ప్రీమియంల చెల్లింపు ద్వారా పాలసీ అమలు చేయబడితే, 6వ పాలసీ సంవత్సరం నుండి పాలసీ టర్మ్ ముగిసే వరకు గ్యారెంటీడ్ అడిషన్స్ వస్తాయి.
సింగిల్ ప్రీమియం చెల్లింపు కింద, పాలసీ పూర్తయిన మూడు నెలల తర్వాత పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా లోన్ అందుబాటులో ఉంటుంది. లిమిటెడ్ ప్రీమియం చెల్లింపు కింద, కనీసం రెండు సంవత్సరాల పూర్తి ప్రీమియంలు చెల్లించిన తర్వాత రుణం లభిస్తుంది.
ఎలా కొనుగోలు చేయాలి?.. ఈ ప్లాన్‌ని ఏజెంట్/ఇతర మధ్యవర్తుల ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు అలాగే ఆన్‌లైన్‌లో నేరుగా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..