ITR filing: గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది? మరో అవకాశం ఉంటుందా? పూర్తి వివరాలు..

|

Jul 18, 2024 | 5:22 PM

ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) అనేది పన్ను చెల్లింపుదారులకు చాలా అవసరం. ఆ ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల ఆదాయాలను వివరిస్తుంది. సకాలంలో ఐటీఆర్ అందజేయకపోతే జరిమానాలు విధించే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి జూలై 31వ తేదీలోపు ఐటీఆర్ సమర్పించాలి. కొన్ని ఇబ్బందుల వల్ల అందజేయలేకపోయిన వారికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ అవకాశం ఉంది. అయితే దీనికి జరిమానా విధిస్తారు.

ITR filing: గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది? మరో అవకాశం ఉంటుందా? పూర్తి వివరాలు..
Itr Filing
Follow us on

ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్)ను సమర్పించడానికి గడువు సమీపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2024-25) 2024 జూలై 31లోపు ఐటీఆర్ అందజేయాలి. పన్నుచెల్లింపుదారులందరూ ఈ పనిలో బిజీగా మారారు. ఇప్పటికే చాలామంది ఐటీఆర్ ను సమర్పించారు. దాని ఆధారంగా ఆదాయపు పన్నుశాఖ లెక్కలు కట్టి, అన్ని అంశాలను పరిశీలించి పన్నును నిర్ధారిస్తుంది. పరిమితికి మించి పన్ను కట్టిన వారికి రీఫండ్ అందిస్తుంది. అయితే ఐటీఆర్ సమర్పించడం ఆలస్యం అయితే జరిమానా కూడా విధిస్తారు.

అత్యవసరం..

ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) అనేది పన్ను చెల్లింపుదారులకు చాలా అవసరం. ఆ ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల ఆదాయాలను వివరిస్తుంది. సకాలంలో ఐటీఆర్ అందజేయకపోతే జరిమానాలు విధించే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి జూలై 31వ తేదీలోపు ఐటీఆర్ సమర్పించాలి. కొన్ని ఇబ్బందుల వల్ల అందజేయలేకపోయిన వారికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ అవకాశం ఉంది. అయితే దీనికి జరిమానా విధిస్తారు.

చాలా ఉపయోగం..

సకాలంలో ఐటీఆర్ ను దాఖలు చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖకు పన్ను లెక్కింపునకు వీలుగా ఉంటుంది. అలాగే జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఆదాయపు పన్ను రిటర్నులను సమయానికి ఫైల్ చేసేలా ఆశాఖ రిమైండర్‌లు పంపుతుంది.

జరిమానాలు..

ఐటీఆర్ ఆలస్యం ఫైలింగ్ చేయడం వల్ల విధించే జరిమానాలు కూడా ఆదాయ స్థాయికి బట్టి మారుతూ ఉంటాయి.

  • 2023-24 (ఏవై 2024-25) ఆర్థిక సంవత్సరానికి రూ.5 లక్షలకు మించిన నికర పన్ను విధించదగిన ఆదాయం కలిగిన వ్యక్తులకు ఆలస్యంగా రిటర్న్‌ను దాఖలు చేసినందుకు గరిష్టంగా రూ.5 వేల జరిమానా విధిస్తారు.
  • రూ.5 లక్షలు, అంతకంటే తక్కువ పన్ను చెల్లింపుదారులకు జరిమానా ఒక వెయ్యి రూపాయాలు విధిస్తారు.
  • ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువ ఆదాయం కలిగిన వారికి జరిమానా నుంచి పన్ను మినహాయింపు ఉంటుంది.

ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల ఉపయోగాలు ఇవే..

  • ఐటీఆర్ దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారులందరికీ తప్పనిసరి. నిబంధనలను పాటించడంలో అలసత్వం వహిస్తే జరిమానాలు విధిస్తారు.
  • మీ ఆదాయ వివరాలు కచ్చితంగా ఫైల్ చేశారని నిర్ధారించుకోవడం వల్ల భరోసా లభిస్తుంది. భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు.
  • మీ రిటర్న్‌ను సకాలంలో దాఖలు చేయడం వల్ల పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే వాపసుల కోసం మీరు అర్హత పొందవచ్చు.
  • ఆలస్యంగా దాఖలు చేయడం వల్ల నిర్దిష్ట పన్ను మినహాయింపులను కోల్పోయే అవకాశం ఉంటుంది.
  • సకాలంలో ఐటీఆర్ ను సమర్పించడం వల్ల ఆందోళన ఉండదు. మీ ఆదాయ, వ్యయాలను మర్చిపోకుండా ఫైల్ చేసే అవకాశం ఉంటుంది.
  • ఐటీఆర్ గడువు తేదీ దగ్గరకు వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే సమర్పించడం చాలా ముఖ్యం.
  • సక్రమంగా ఫైలింగ్ చేసుకోవడం కోసం మీ జీతం స్లిప్‌లు,పెట్టుబడి రుజువులు తదితర అన్ని పత్రాలను ముందుగానే సేకరించుకోవాలి.
  • ఫైల్ చేసే సమయంలో ఇబ్బందులు ఏమైనా ఎదురైతే పన్ను నిపుణులను సంప్రదించాలి. ఆదాయపు పన్ను శాఖ అందించే ఆన్‌లైన్ వనరులను ఉపయోగించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..