ప్రకృతి వైపరీత్యాలు మన దేశంలో సర్వ సాధారణం. జమ్మూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఒక్కోచోట ఒక్కో రకమైన వాతావరణ పరిస్థితులు, ఒక్కోరకమైన భౌగోళిక స్థితిగతులు కనిపిస్తుంటాయి. కొన్ని చోట్ల భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. మరికొన్ని చోట్ల మెరుపు వరదలు కబళించేస్తాయి. అటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో మన ఎంత ధృడంగా కట్టడాలు నిర్మించుకున్నా.. దెబ్బతినడం సహజమే. దానిని మళ్లీ మరమ్మతులు చేయించాలంటే ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అలాంటి సమయంలో మనపై ఆర్థిక భారం లేకుండా చేసేదే హోమ్ ఇన్సురెన్స్. దీని వల్ల ప్రయోజనాలు ఏంటి? ఎలా కొనుగోలు చేయాలి? తెలుసుకుందాం..
ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో భారత ఉపఖండం ఒకటి. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో దాదాపు 27 ప్రాంతాలలో విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 58.6% భూభాగం మధ్యస్థం నుంచి చాలా ఎక్కువ తీవ్రతతో భూకంపాలకు గురవుతున్నాయి. 12% భూమి వరదలు, నదుల కోతకు గురవుతోంది. 7,516 కి.మీ తీరప్రాంతంలో, 5,700 కి.మీ తుఫానులు, సునామీలకు గురయ్యే అవకాశం ఉంది. 68% సాగు భూమి కరువునకు గురవుతుంది. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, హిమపాతాలు సంభవించే ప్రమాదం ఉంది. 15% భూభాగం కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. మొత్తం 5,161 పట్టణ స్థానిక సంస్థలు వరదలకు గురయ్యే అవకాశం ఉంది.
రుతుపవనాల సమయంలో తుఫానులు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు వంటి వాటి వల్ల ముప్పు చాలా తీవ్రంగా ఉంటుంది. మన కారుకు అయితే కారు ఇన్సురెన్స్, ద్విచక్ర వాహనాలకు అయితే బైక్ ఇన్సురెన్స్ వంటివి ఉంటాయి. సరిగ్గా ఇలాగే ప్రకృతి వైపరిత్యాల వల్ల దెబ్బతినే ఇళ్లకు కూడా ఇన్సురెన్స్ ఉంటుంది. ఈ గృహ బీమా కేవలం రక్షణ మాత్రమే కాకుండా మీరు కష్టపడి సంపాదించిన ఆస్తులను సంరక్షించే కీలకమైన పెట్టుబడి కూడా.
గృహ బీమా మీ ఆస్తిని-అది బంగళా, అపార్ట్‌మెంట్, అద్దెకు తీసుకున్న ఫ్లాట్ లేదా సొంతమైన ఇల్లు వంటి వాటిని వివిధ ప్రమాదాల నుంచి రక్షించడానికి రూపొందించారు. గృహయజమానులకు ‘కచ్చా’ గృహ నిర్మాణాలకు బీమా చేసుకునే అవకాశం కూడా ఉంది.
సమగ్ర గృహ బీమాలో నిర్మాణానికి సంబంధించినవ, గృహోపకరణాలు, ప్రమాదకారణం మరణం, అద్దె కవర్ వంటివి ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..