Union budget: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో తగ్గనున్న ట్యాక్స్..?

|

Dec 28, 2024 | 5:15 PM

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నప్పుడల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తమకు లభించే పన్ను మినహాయింపుల కోసం ఎదురు చూస్తుంటారు. పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా ఆర్థిక ప్రణాళిక సక్రమంగా ఉండటానికి ఇలాంటి వాటిని కోరుకుంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న 2025-26 బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దానిలో ఆమె ప్రజలకు గొప్ప శుభవార్త చెబుతారని విశ్వసనీయ సమాచారం. మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగేలా రూ.15 లక్షల వరకూ వార్షిక సంపాదనపై ఆదాయపు పన్ను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Union budget: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో తగ్గనున్న ట్యాక్స్..?
Follow us on

కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్ లో దేశ ప్రజలందరికీ గొప్ప శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. అభివృద్ధి మందగమనం, ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్నిపెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు. పౌరులపై భారాన్ని తగ్గించేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పలువురు ఆర్థిక ప్రముఖులు కోరారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో బడ్జెట్ పై వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ప్రధాని విన్నారు. ఆదాయపు పన్నును తగ్గించడంతో పాటు కస్టమ్స్ టారీఫ్ లను హేతుబద్ధీకరించాలని, రాబోయే బడ్జెట్ లో ఎగుమతుకు మద్దతు ఇచ్చే చర్యలను ప్రవేశపెట్టాలని కూడా కోరినట్టు సమాచారం. ఆదాయపు పన్ను మినహాయింపు నిజంగా జరిగితే దేశంలో కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుంది.

దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పాత, కొత్త అనే రెండు రకాల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పాత పన్ను విధానంలో ఇతర ఖర్చులతో పాటు అద్దె, బీమా మినహాయింపులు ఇస్తారు. కొత్త పన్ను విధానంలో చాలా మినహాయింపులను తొలగిస్తూ, పన్ను రేటును తగ్గిస్తారు. ప్రజలు తమకు అనుకూలంగా ఉండే విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను కొత్త విధానాన్ని 2020లో తీసుకువచ్చారు. దీని ప్రకారం.. ఏడాదికి రూ.3 లక్షలు సంపాదించే వ్యక్తులు పన్ను నుంచి మినహాయింపు పొందుతారు. ఇక రూ.మూడు లక్షల నుంచి రూ. ఏడు లక్షలు సంపాదించే వారు 5 శాతం, అలాగే రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షలకు 10 శాతం, ఆ తర్వాత రూ. పది లక్షల నుంచి రూ.12 లక్షలకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు 20 శాతం, రూ.15 లక్షలకు మించితే 30 శాతం పన్ను కట్టాలి.

పాత పన్ను విధానంలో ఏడాదికి రూ.2.50 లక్షల ఆదాయాన్ని పన్ను నుంచి మినహాయిస్తారు. ఆ తర్వాత రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ 5 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ 20 శాతం, రూ.పది లక్షలకు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను కట్టాలి. దీనిలో ఇంటి అద్దె, బీమా ప్రీమియ వంటి ఖర్చులకు కూడా పన్ను మినహాయింపులను పొందవచ్చు. పన్ను రేటును తగ్గించడం వల్ల చెల్లింపుదారులకు ఊరట కలుగుతుంది. దేశంలో రూ.పది లక్షలు సంపాదించ వ్యక్తుల నుంచి ఎక్కువ పన్నువస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి