Post Office: కేంద్ర ప్రభుత్వం దేశంలోని పోస్టాఫీసులలో టెక్నాలజీని మరింత వేగంగా విస్తరిస్తోంది. పోస్టాఫీసులో ఇప్పుడు అన్ని సేవలు ప్రైవేట్ లేదా ప్రభుత్వ బ్యాంకుల మాదిరిగానే జరుగుతాయి. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా డబ్బులు పంపే పని ఇప్పుడు పోస్టాఫీసులో మొదలైంది. దాదాపు 96 శాతం పోస్ట్ ఆఫీస్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌కి (CBS) అనుసంధానించారు. అంటే అన్ని పోస్టాఫీసులు డిజిటల్ ప్రపంచంలోకి మారాయి. అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అంతేకాదు అన్ని పోస్టాఫీసులు బ్యాంకులతో అనుసంధానించారు. ఇప్పటికే బ్యాంకుల్లో చాలా కాలంగా సీబీఎస్ టెక్నాలజీ అమలవుతోంది. అది ఇప్పుడు పోస్టాఫీసులో ప్రారంభమైంది. ఈ ప్రత్యేక సేవలకి ‘ఎనీటైమ్-ఎనీవేర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
‘ఎనీటైమ్-ఎనీవేర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్’ ప్రవేశపెట్టడంతో ఇప్పుడు పోస్టాఫీసు సేవింగ్స్‌ని ఎక్కడి నుంచైనా పొందవచ్చు. దేశంలో మొత్తం1,58,526 పోస్టాఫీసులు ఉండగా వాటిలో ఇప్పటి వరకు 1,52,514 పోస్టాఫీసులు CBS పరిధిలోకి వచ్చాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో 1.5 లక్షల పోస్టాఫీసుల్లో 100 శాతం సిబిఎస్ విధానాన్ని అమలు చేస్తామని తద్వారా ప్రజలు సులభంగా ఆర్థిక లావాదేవీలను పొందుతారని చెప్పారు. ఆన్‌లైన్ ఖాతా సహాయంతో నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ATM, ఆన్‌లైన్ నిధుల బదిలీ మొదలైనవి పోస్టాఫీసులు, బ్యాంకుల మధ్య చేయవచ్చు. ఇది పోస్టాఫీసులో ప్రస్తుత పొదుపు ఖాతాదారులకు కలిసివస్తుంది. అలాగే కొత్త ఖాతాను తెరిచే వ్యక్తులు కూడా ఈ ఆన్‌లైన్ సేవ ప్రయోజనాన్ని పొందుతారు.
పోస్టాఫీసులో ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ కోసం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) సౌకర్యాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. NEFT, RTGS ద్వారా పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు లేదా బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు డబ్బును బదిలీ చేసుకోవచ్చు. పోస్టాఫీసులో ఇంటర్మీడియట్ డేటా రేట్ (IDR) కనెక్టివిటీ, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) కనెక్షన్, VSAT కనెక్టివిటీని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దీంతో పాటు కొన్ని పోస్టాఫీసుల్లో సిమ్ కార్డ్ ఆధార్ పీఓఎస్ మిషన్లు కూడా ఇస్తారు.