రెండు మూడు రోజుల్లో ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ నుంచి ఉద్యోగుల జీత భత్యాలకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డీయర్ నెస్ అలోవెన్స్(డీఏ) పెరగనుంది. దీనికి సంబంధించిన ఊహాగానాలు ఉద్యోగుల్లో భారీగా ఉన్నాయి. డీఏ ఎంత పెంచుతారు? తద్వారా జీతం ఎంత మేర పెరుగుతుంది వంటి విషయాలపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు విషయంపై ఉద్యోగుల్లో చర్చకు దారితీసింది. వచ్చే ఏడాది ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏడో వేతన సంఘం స్థానంలో ఎనిమిదో వేతన సంఘ సూచనలను ఇంప్లిమెంట్ చేయాలన్న వాదన ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది.
ఇటీవల కొన్ని నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులపై ఓ ప్రకటన చేస్తుందని అంతా భావించారు. 2023 బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన ప్రస్తావన వస్తుందని ఆశించారు. అయితే అటువంటి ప్రస్తావన ఏమి లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.
ప్రస్తుతం మీడియా సర్కిళ్లలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఏడో వేతన సంఘం స్థానంలో ఎనిమిదో వేతన సంఘ సిఫార్సులను అమలు చేస్తారని ఉద్యోగుల్లో ఊహాగానాలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రతి పదేళ్లకు ఓసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పే కమిషన్ నిబంధనలు మారుతుంటాయి. ఇదే విధానంలోనే ఐదు, ఆరు, ఏడో పే కమిషన్లు మారుతూ వచ్చాయి. అయితే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటనా లేదు. కొన్ని నివేదికల ప్రకారం 2024లో దీనికి సంబంధించిన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు రకాల ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. 2024లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ లోపు దీనిపై కేంద్రం ఓ ప్రకటన చేసి, ఉద్యోగులను తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని కొంత మంది నిపుణులు భావిస్తున్నారు. మరికొంత మంది ఇవన్నీ మాటలకు పరిమితమవుతాయి. ఏదైనా 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలు ఎలా ఉన్నా 2024 అయితే ఎనిమిదో వేతన సంఘం ఏర్పటయ్యే అవకాశాలైతే కచ్చితంగా ఉన్నాయి. అదే జరిగితే 2026కి ఆ సిఫార్సుల అమలు జరుగుతుంది. అప్పుడు ఉద్యోగుల జీతభత్యాల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..