Telugu News Business Good news for those who want to buy a car, Huge discounts on those cars, Mahindra offers details in telugu
Mahindra offers: కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆ కార్లపై భారీ తగ్గింపులు
కాలగమనంలో నడుస్తున్న ఈ ఏడాది చివరి దశకు వచ్చేసింది. మరో 20 రోజుల్లో నూతన సంవత్సరం రానుంది. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సన్నద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కార్ల కంపెనీలు ఇయర్ ఎండ్ ఆఫర్లు ప్రకటించాయి. తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా కూడా ఈ వరసలో చేరింది. పలు రకాల ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
కార్ల కంపెనీలు ప్రకటించిన ఆఫర్లతో మార్కెట్ లో సందడి నెలకొంది. కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొత్త కారుతో కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకాలనుకునే వారికి డిసెంబర్ చాలా అవకాశాలు కల్పిస్తోంది. మహీంద్రా కంపెనీ కార్లకు మన దేశంతో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మార్కెట్ లో ఈ బ్రాండ్ కు ప్రముఖ స్థానం ఉంది. బ్రాండ్ ఆఫ్ స్టాక్ క్లియరెన్స్ లో భాగంగా మహీంద్రా కంపెనీ ఇయర్ ఎండ్ ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా తన మోడళ్లను భారీ తగ్గింపు ధరలకు విక్రయిస్తోంది. ఎక్స్ యూవీ3ఎక్స్ఓ, థార్ రోక్స్ మినహా మిగిలిన అన్ని మోడళ్లకు ఈ ఆఫర్ వర్తింపజేసింది. ఇయర్ ఎండ్ ఆఫర్ లో ఉన్న ప్రముఖ మోడళ్లు ఇవే.
తగ్గింపులు ఇలా
మహీంద్రా బోలెరో నియోపై రూ.1.20 లక్షల తగ్గింపు లభిస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.11.35 లక్షల నుంచి 17.60 లక్షల వరకూ ఉంది. ఇయర్ ఎండ్ ఆఫర్ లో భాగంగా రూ.70 వేల నగదు తగ్గింపు, రూ.30 వేల యాక్సెసరీలు, రూ.20 వేల ఎక్స్చేంజ్ బోనస్ అందిస్తున్నారు. డిసెంబర్ లో ఈ కారును కొనుగోలు చేయడం వల్ల దాదాపు రూ.1.20 లక్షలు ఆదా చేసుకోవచ్చు.
మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన తొలి కారు ఎక్స్ యూవీ 400ను ఘనంగా విడుదల చేసింది. రెండు రకాల వేరియంట్లలో ఈ కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. సింగిల్ చార్జింగ్ తో సుమారు 450 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఈ కారుపై కూడా ఇయర్ ఎండ్ ఆఫర్ అందుబాటులో ఉంది. దాదాపు రూ.3 లక్షల తగ్గింపు పొందవచ్చు.
మహీంద్రా నుంచి విడుదలైన థార్ మోడల్ కు మన దేశంలో ఎంతో క్రేజ్ ఉంది. సామాన్యులందరికీ ఈ పేరు సుపరిచితమే. ఇయర్ ఎండ్ ఆఫర్ లో భాగంగా థార్ 4×2 మోడల్ పై రూ.1.30 లక్షల వరకూ తగ్గింపు అందిస్తున్నారు. అలాగే ఎర్త్ ఎడిషన్ 4×4 మోడళ్లు స్టాక్ ముగిసే వరకూ రూ.3 లక్షల తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి.
స్కార్పియో ఎన్ కారుపై కూడా డిస్కౌంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మోడల్ పై రూ.50 వేల తగ్గింపు అందిస్తున్నారు.
మహీంద్రా ఎక్స్ యూవీ 700 మోడల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ అమలు చేస్తున్నారు. దాదాపు రూ.40 వేల వరకూ తగ్గింపు పొందవచ్చు.