ప్రభుత్వ బ్యాంక్‌లు.. తమ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిని అనుమతించనున్నాయి. త్వరలో ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేయనుంది. వారానికి ఐదు రోజుల పని పద్ధతి పై ఇంతకుముందే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయి. ఫైవ్ డే వర్క్ వీక్‌కు బదులుగా బ్యాంక్ సిబ్బందికి రోజుకు 40 నిమిషాలు పనివేళలు పెరుగుతాయి. ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగులు రెండో, నాల్గో శనివారాలు సెలవు తీసుకుంటున్నారు. ప్రతీ నెలా మొదటి, మూడో శనివారాల్లో బ్యాంక్‌లు తెరిచి ఉంటున్నాయి.
వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన అజయ్ బంగా నియామకం కానున్నారు. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ ధృవీకరించింది. అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఈ ఏడాది జూన్ 2వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో ఆయన ఐదేండ్ల పాటు కొనసాగనున్నారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పోస్టుకు అజయ్ బంగా నామినేట్ అయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బోర్డు సభ్యులందరూ ఆమోదించాక వరల్డ్ బ్యాంక్ ఒక ప్రకటన చేసింది. 189 దేశాలకు సభ్యత్వం ఉన్న ప్రపంచ బ్యాంక్‌లో ముఖ్యమైన విభాగాలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకోవడం మిగతా రంగాలపై ప్రభావం పడుతోంది. పెరుగుతున్న ధరలను స్థిరీకరించేందుకు మరోసారి వడ్డీ రేట్లను పెంచింది బ్యాంక్. తాజాగా 25 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లు పెంచింది. వడ్డీరేట్లు పెంచడం గత 14 నెలల్లో ఇది పదోసారి. పెంచిన ప్రకారం ప్రస్తుతం వడ్డీ రేట్లు 5 నుంచి 5.25 శాతానికి చేరుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో కీలక వడ్డీ రేట్లు పెరుగుతుండడంతో హౌసింగ్, కీలక వ్యాపారాలపై ప్రభావం పడనుంది. ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరడంతో కట్టడి చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ గతకొన్ని నెలలుగా వడ్డీరేట్లను పెంచుతూ వస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..