బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది ఇదే..

Gold vs Silver: 2025లో బంగారం, వెండి భారీ లాభాలనిచ్చాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి ధరల పెరుగుదలకు కారణాలు. మరి కొత్త సంవత్సరంలో వీటి ధరలు ఎలా ఉంటాయి. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి..? దీనిపై నిపుణులు ఏమంటున్నారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది ఇదే..
Gold And Silver Price Prediction 2026

Updated on: Dec 27, 2025 | 4:06 PM

బంగారం, వెండి ధరలు గత ఏడాది కాలంగా అంతకంతకూ పెరుగుతూ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.  గడిచిన ఏడాది కాలంగా స్టాక్ మార్కెట్ కంటే బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించింది. నిఫ్టీ 50 కేవలం 10.18శాతం రాబడిని ఇస్తే.. బంగారం 78శాతం, వెండి ఏకంగా 144శాతం లాభాలను అందించాయి. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో ఈ విలువైన లోహాల ప్రస్థానం ఎలా ఉండబోతోంది? నిపుణుల అంచనాలు ఏంటి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రికార్డు స్థాయిలో ధరల పెరుగుదల

గత డిసెంబర్ 2024లో రూ.75,233 వద్ద ఉన్న బంగారం ధర.. ఇప్పుడు రూ.1,33,589కి చేరింది. అదే సమయంలో వెండి కిలోకు రూ. 85,146 నుండి రూ. 2,08,062కి ఎగబాకింది. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా సుంకాల విధింపు వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

2026లో ధరల అంచనా: ఎంత పెరగవచ్చు?

నిపుణుల విశ్లేషణ ప్రకారం.. 2026లోనూ పసుపు, తెలుపు లోహాల జోరు కొనసాగనుంది. బంగారం రూ.1,50,000 నుంచి 1,65,000 చేరే అవకాశం ఉంది. కిలో వెండి రూ.2,30,000 – రూ.2,50,000 చేరే అవకాశం ఉంటుంది. ఆనంద్ రతి డైరెక్టర్ నవీన్ మాథుర్ అభిప్రాయం ప్రకారం.. వడ్డీ రేట్ల తగ్గింపు, బలహీనపడుతున్న డాలర్, భౌగోళిక రాజకీయ పరిస్థితులు బంగారానికి మద్దతునిస్తాయి. అయితే శాతం పరంగా చూస్తే బంగారం కంటే వెండి మెరుగైన రాబడిని ఇచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

బంగారం vs వెండి: ఏది బెస్ట్?

పరిశ్రమల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం, సరఫరా తక్కువగా ఉండటం వల్ల వెండి ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉందని రిద్ధి సిద్ధి బులియన్స్ MD పృథ్వీరాజ్ కొఠారి తెలిపారు. ముఖ్యంగా 2026 మొదటి అర్ధభాగంలో వెండి దూసుకుపోవచ్చు. పోర్ట్‌ఫోలియో స్థిరత్వం కోసం బంగారం ఎప్పుడూ ఉత్తమమైనది. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని చెప్పారు.

పెట్టుబడి వ్యూహం

నిపుణులు ఇచ్చే సలహా ఏంటంటే.. బంగారంపై దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం SIP పద్ధతిలో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం. ఇది సగటు కొనుగోలు వ్యయాన్ని తగ్గిస్తుంది. వెండిలో అస్థిరత ఎక్కువ. కాబట్టి మార్కెట్ తగ్గినప్పుడు ఏకమొత్తంగా లేదా క్రమబద్ధమైన SIPల ద్వారా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలని SPA క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ జైన్ సూచించారు.

బంగారం – వెండి నిష్పత్తి

సంవత్సరం ప్రారంభంలో 87గా ఉన్న బంగారం-వెండి నిష్పత్తి ప్రస్తుతం 64.70కి పడిపోయింది. ఈ నిష్పత్తి తగ్గడం అంటే వెండి ధర వేగంగా పెరుగుతోందని అర్థం. చారిత్రాత్మక పరిస్థితులను బట్టి చూస్తే వెండి తన దూకుడును కొనసాగిస్తూ బంగారం ధరతో ఉన్న వ్యత్యాసాన్ని మరింత తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 2026లో కూడా బంగారం, వెండి సానుకూల ధోరణిలోనే ఉంటాయని అని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ తెలిపారు. అయితే ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి స్థిరత్వం కోసం బంగారాన్ని, అధిక లాభాల కోసం వెండిని ఎంచుకోవాలని వారు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి