పండగ వస్తే ఒక్కొక్కరి సరదా ఒక్కోరకంగా ఉంటుంది. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని ముచ్చట పడిపోతారు. మహిళలు అయితే పండగ.. అందులోనూ దీపావళి వస్తుంది అంటే పిసరంత అయినా బంగారం కొనుక్కోవాలని ఆశపడతారు. దీపావళికి బంగారం కొంటే లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందన్న నమ్మకమే దీనికి కారణం. బంగారం ధరలు స్థిరం లేకుండా ప్రతిరోజూ మారుతూనే ఉంటాయి. ఒకరోజు పెరిగి.. మరో రోజు కాస్త తగ్గి అటూ ఇటూ మారుతూనే ఉంటాయి. డిమాండ్ అండ్ సప్లై లెక్కల్లో బంగారం ధరలకు రెక్కలు వచ్చేస్తాయి ఒక్కోసారి. పండక్కి బంగారం కొందామని అనుకుని డబ్బు పోగేస్తే.. సరిగ్గా పండగ సమయానికి బంగారం ధరలు పరుగులు తీసి మహిళలకు నిరాశ కల్పిస్తుంది. ఇది దాదాపుగా ప్రతి దీపావళి పండక్కి జరుగుతూనే ఉంటుంది. ఇదిగో మళ్ళీ దీపావళి వచ్చేసింది. కొద్దీ రోజుల క్రితం వరకూ బంగారం ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.
నిన్న అంటే 13వ తేదీ 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 58,910 రూపాయలుగా ఉండగా అది ఒక్కరోజులో 1530 రూపాయలు పెరిగి 60 వేల రూపాయల మార్క్ దాటిపోయింది. ఈరోజు అంటే 14వ తేదీ 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 60,440 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఒక్క రోజులో పది గ్రాములకు 1400 రూపాయలు పెరిగింది. దీంతో ఈరోజు దీని ధర 55,400 రూపాయలకు చేరుకుంది.
అక్టోబర్ ప్రారంభంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 58,200 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 53,300 గా ఉంది. అంటే ఈ 14 రోజుల్లో బంగారం ధరల్లో ఎంత పెరుగుదల ఉందొ గమనించవచ్చు. ఇకపై ధరలు తగ్గే అవకాశం అయితే లేదని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి ఉన్న ట్రెండ్ ను అనుసరించి.. దీపావళి నాటికి బంగారం ధరలు 60 వేల రూపాయలకు దగ్గరగా ఉంటాయని అంచనాలు వేశారు. కానీ, ఇప్పుడు ఆ అంచనాలు తప్పుతున్నాయి. ఇప్పటికే 60 వేల మార్క్ ని బంగారం టచ్ చేసింది. ఇంకా దీపావళికి దాదాపుగా నెల రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు 65 వేల రూపాయలకు పైగా చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీపావళికి ఉండే డిమాండ్ తో పాటు ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు మరింత పెరగవచ్చని చెబుతున్నారు. ఈ యుద్ధం ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశముందన్న హెచ్చరికలు స్టాక్ మార్కెట్ మదుపర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు వారు మొగ్గుచూపడంతో పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇప్పటికే బంగారం ధరలు నెల రోజుల గరిష్ఠానికి చేరాయి. ముందు ముందు మరింత పెరుగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. దీపావళి నాటికి బంగారం ధరలు రూ.65 వేలకు చేరే అవకాశముందని అంచనావేస్తున్నారు. అందుకే చేతిలో డబ్బు ఉంటే దీపావళి వరకు ఆగడం కంటే ఇప్పుడే పసిడి ఆభరణాలను కొనుగోలు చేయడం ఉత్తమమని మార్కెట్ నిపుణులు సలహా ఇస్తున్నారు.
మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న అంటే 13 వ తేదీ కేజీ వెండి ధర 72,600 రూపాయలు ఉంది. ఈరోజు అది 1500 రూపాయలు పెరిగి 74,100 రూపాయలకు చేరుకుంది. దీపావళి నాటికి వెండి ధరలు కూడా బాగా పెరుగుతాయని అంచానా వేస్తున్నారు.