భారత్‌లో పసిడి ధరలు గత కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చు తగ్గులను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల గ్రాము బంగారం రూ.7,100కి అమ్ముడవుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.7,745గా ఉంది. దీపావళి తర్వాత డిమాండ్ తగ్గడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్ విజయం, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగడం వంటి కారణాలతో బంగారం ధరలు హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
మరి 2025లో బంగారం ధర పెరుగుతుందా? తగ్గనుందా? అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో.. 2025లో బంగారం ధరలు తగ్గే అవకాశముందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనావేస్తోంది. డబ్ల్యుజిసి చేసిన ఈ ప్రకటన వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తోంది.
గత నవంబర్ నెలలోనే బంగారం ధరలో తీవ్ర హెచ్చు తగ్గులు నమోదయ్యాయి. అంటే, నవంబర్ ప్రారంభంలో ఒకే వారంలో తీవ్ర క్షీణత నమోదుకాగా.. నవంబర్ చివరిలో ఒకే వారంలో తీవ్ర పెరుగుదల నమోదయ్యింది. నవంబర్ 5న అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు జరగ్గా.. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. డాలర్ విలువ పుంజుకోవడమే దీనికి కారణం. అయితే నవంబర్ 19 నుంచి 24 మధ్య కాలంలో బంగారం ధర మళ్లీ పెరిగింది.
గత కొన్ని నెలలుగా బంగారం ధర తీవ్ర హెచ్చుతగ్గులను ఎదుర్కొంటుండగా.. వచ్చే ఏడాది 2025కు సంబంధించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ కీలకమైన అంచనాను విడుదల చేసింది. 2025లో బంగారం ధర మెల్లగా పెరుగుతుందని లేదా బంగారం ధర తగ్గే అవకాశాలున్నాయని అంచనావేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనందున, ఆయన జనవరి 20, 2025న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సమయంలో, ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి డాలర్‌పై ఉంటుంది. దీని వల్ల బంగారం ధర తగ్గే అవకాశం ఉందని విశ్లేషించింది. ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపడితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకే మదుపర్లు మళ్లీ మొగ్గుచూపే అవకాశం ఉంది.
అయితే అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వస్తే మాత్రం బంగారం ధరకు మళ్లీ రెక్కలు వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రపంచంలోని పలు దిగ్గజ బ్యాంకులు కూడా ఇదే అంచనావేస్తున్నాయి.