
ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్థిక నిపుణులు బంగారం ధరల పెరుగుదలకు ప్రపంచ ఆర్థిక అస్థిరతే ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. గతంలో యుద్ధాల సమయంలో కూడా ఇదేవిధంగా బంగారం, వెండి ధరలు పెరిగాయని.. ఇప్పుడు అమెరికా విధిస్తున్న సుంకాల భారం కూడా ఇతర దేశాలను యుద్ధం తరహాలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫలితంగా బంగారం ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తున్నట్టు భావిస్తున్నారు.
పెరుగుతున్న బంగారం ధరలపై ప్రపంచవ్యాప్తంగా పలు అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా విధిస్తున్న సుంకాల వల్లనే ధరల్లో ఈ మార్పులొస్తున్నాయి అంటున్నారు అమెరికాకు చెందిన రే దాలియో అనే ఇన్వెస్టర్. ఈ విషయంపై మాట్లాడుతూ బంగారం విలువ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందన్నారు. ఇతరదేశాలపై విధించే సుంకాల వల్ల ఆ దేశ కరెన్సీపై మిగతా దేశాలకు నమ్మకం పోతుందన్నారు. తద్వారా అమెరికా డాలర్ క్షీణించే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటప్పుడు విలువైన లోహాలకు ఆటోమెటిక్‌గా డిమాండ్ పెరుగుతుందని ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు. దీన్నిబట్టి చూస్తే.. బంగారం ధరల్లో కొద్దిపాటి తగ్గుదల కనిపించినా.. ఫ్యూచర్‌లో మళ్లీ పెరిగే అవకాశం ఉందిని, లాంగ్ టర్మ్‌లో బంగారానికి మంచి విలువ ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఇకపోతే బంగారం ధరలు ఈ ఒక్క ఏడాదిలో 50 శాతానికి పైగా పెరిగాయి. అయితే మధ్యలో కొన్ని వారాల్లో కొంత తగ్గుదల నమోదు చేసినా మళ్లీ తిరిగి ఆల్ టైం హయ్యెస్ట్ ధరలకు చేరుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలు ఇతర కారణాల వల్లే ధరల్లో ఈ మార్పులు అని చెప్పొచ్చు. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చైనా అధ్యక్షుడిని కలవబోతున్నట్టు వార్త రాగానే ఆసియా దేశాలకు చెందిన షేర్ ధరల్లో భారీగా పెరుగుదల కనిపించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు చాలా ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నట్టు మార్కెట్ ట్రెండ్స్ చెప్తున్నాయి. ముఖ్యంగా అమెరికా తీసుకుంటున్న ఆర్థిక లేదా వాణిజ్య పరమైన నిర్ణయాలను అనుగుణంగా ఇన్వెస్టర్ల నిర్ణయాలు మారుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి