
దేశంలో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే లక్షక్షా 10 వేలకుపైనే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి లేదు. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. ఇప్పటి వరకు బంగారం ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ సెప్టెంబర్ 16న స్వల్పంగా తగ్గింది. అది వినియోగదారులకు పెద్దగా ఊరటనిచ్చే అంశమేమి కాదు. దేశీయంగా తులం బంగారం ధర రూ.1,11,050 ఉంది.
ధరలు పెరగడానికి కారణాలు ఏంటి?
బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. బంగారం ధరల పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో మార్పులు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికంగా ఉండటం ఇవన్నీ ప్రధాన కారణాలు అని చెబుతున్నారు. అంతేకాదు ద్రవ్యోల్బణం పెరిగిన సందర్భాల్లో చాలా మంది పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లడం వల్ల ధరలు ఇంకా ఎగబాకుతున్నాయి. ఇక రానున్న పండుగ సీజన్‌లో భారత్‌లో బంగారం డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా.