Gold Price: లక్షకు బంగారం..! రష్యా దెబ్బకు లెక్కలన్నీ తలకిందులు..

ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలకు త్వరలోనే బ్రేక్ పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో రష్యా తిరిగి అమెరికా డాలర్‌ను వాడాలని నిర్ణయించుకోవడంతో ప్రపంచ మార్కెట్‌లో అనూహ్య మార్పులు మొదలయ్యాయి. ఈ పరిణామంతో డాలర్ బలపడి, పసిడి ధరలు భారీగా కరుగుతున్నాయి. బంగారం ఎంత తగ్గే అవకాశం ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Gold Price: లక్షకు బంగారం..! రష్యా దెబ్బకు లెక్కలన్నీ తలకిందులు..
Will Gold Fall Below 1 Lakh In India

Updated on: Feb 17, 2026 | 8:33 AM

బంగారం ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. గతేడాది కాలంగా గోల్డ్ ధరలు అంతకంతకూ పెరుగుతూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. అటు వెండి సైతం బంగారంతో మించి పైపైకి దూసుకెళ్తుంది. అయితే నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఇప్పుడు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా భారత్‌లో ఒక సావరిన్ (ఎనిమిది గ్రాముల) బంగారం ధర రూ.1,15,000 మార్కును దాటి.. సామాన్యులకు ఎనిమిదవ వింతలా మారుతుందేమోనన్న ఆందోళన కలిగించింది. అయితే తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు బంగారం ధరల పతనానికి నాంది పలికాయి. జనవరి 29 నుండి బంగారం ధరల్లో స్థిరమైన తగ్గుదల కనిపిస్తోంది. త్వరలోనే ఇది రూ.1 లక్ష కంటే కిందికి పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ధరల పతనానికి రష్యా మాస్టర్ స్ట్రోక్..

బంగారం ధరలు అకస్మాత్తుగా తగ్గడానికి ప్రధాన కారణం రష్యా తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ వాణిజ్యంలో రష్యా తిరిగి అమెరికా డాలర్‌ను ఉపయోగించాలని నిర్ణయించుకుంది. గతంలో డాలర్‌ను బలహీనపరిచేందుకు రష్యా, చైనా వంటి దేశాలు భారీగా బంగారాన్ని నిల్వ చేశాయి. అయితే ఇప్పుడు రష్యా తిరిగి డాలర్ వైపు మొగ్గు చూపడంతో గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ విలువ అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుండి తప్పుకుని డాలర్ వైపు మళ్లుతారు. దీనివల్ల బంగారంపై డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి.

చైనా వ్యూహానికి గండి?

ట్రంప్ విధించిన ఆర్థిక ఆంక్షలను ధిక్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఒక కూటమిగా ఏర్పడి డాలర్‌ను కాదని బంగారాన్ని నిల్వ చేశాయి. కానీ రష్యా ఇప్పుడు తన వైఖరిని మార్చుకుని తిరిగి డాలర్ ఆధారిత ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా బంగారం నిల్వలను మార్కెట్లోకి తెచ్చేలా ప్రేరేపిస్తోంది.

భారత మార్కెట్‌లో తాజా పరిస్థితి

ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,000 వద్ద ట్రేడ్ అవుతోంది. కానీ నిపుణుల అంచనా ప్రకారం.. యుద్ధ వాతావరణం, రాజకీయ అస్థిరత తగ్గడం వల్ల బంగారంపై ఒత్తిడి తగ్గింది. అంతర్జాతీయంగా డాలర్ పుంజుకోవడం వల్ల భారత్‌లో పసిడి ధర లక్ష రూపాయల లోపుకు చేరుకోవడం ఖాయమని తెలుస్తోంది.

బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, కొనుగోలుదారులు ఒకేసారి భారీగా పెట్టుబడి పెట్టకుండా ధరలు పూర్తిగా స్థిరపడే వరకు వేచి చూడటం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ధరలు తగ్గుతుండటం భారతీయ కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే విషయమే. రష్యా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆర్థిక మార్పులకు దారితీస్తుందో రానున్న రోజుల్లో చూడాలి.

Follow Us