
గోల్డ్ ర్యాలీకి బ్రేకులు పడ్డాయి. బంగారం ధర అత్యంత భారీగా పెరిగి.. ఇప్పుడు పడుతూ వస్తోంది. మంగళవారం (అక్టోబర్ 28) బంగారం, వెండి మార్కెట్లు భారీ పెరుగుదల తర్వాత కొంతమేర చల్లబడాయి. గత పది రోజుల్లో రూ.13 వేలకు పైగా తగ్గిన పుత్తడి.. ఈరోజు కూడా పడిపోయింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షా 20వేల పలుకుతోంది. అయితే అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా బంగారం ధర తగ్గుతోంది. ఇక వెండి సైతం నేలచూపులు చూస్తోంది. మంగళవారం మార్కెట్లు ముగిసే సమయానికి హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.లక్షా 65వేలు పలుకుతోంది.
భగ్గున మండిన బంగారం ధరలు.. ఇప్పుడు చల్లబడుతున్నాయి. ఇన్నాళ్లూ ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన గోల్డ్ రేట్లు.. కంప్లీట్ యూటర్న్ తీసుకున్నాయి. ఒక్కరోజులో 2వేల 460 రూపాయలకు పడిపోవడంతో.. బులియన్ మార్కెట్లో కాస్తంత రిలీఫ్ కనిపిస్తోంది. అక్టోబర్ 16 తేదీన 24 క్యారెట్ల తులం బంగారం లక్షా 36వేల ధర పలికింది. ఇక లక్షన్నరే టార్గెట్‌గా పసిడి పరుగులు తీస్తుందని అంతా భావించారు కాని.. జరిగింది వేరు. బంగారం రూటు మార్చి దిగొస్తోంది. అమెరికా లెక్కల ప్రకారం ఔన్సు బంగారం 4360 డాలర్లను తాకింది. రెండ్రోజులు అక్కడే చక్కర్లు కొట్టి.. ఒక్కసారిగా టప్ మని పడిపోయింది. రెండు రోజుల్లో 300 డాలర్లు దిగింది. ఇంకా తగ్గుతుందన్న టాక్ ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధర లక్షా 20వేల 820కి చేరింది. ఇక కిలో వెండి ధర.. లక్షా 65వేలకు చేరింది. వెండి ఒకానొక దశలో లక్షా 88వేలకు చేరుకుని.. ఇప్పుడు పాతిక వేలు దిగివచ్చింది. మరికొన్ని రోజుల్లో బంగారం ధరలు ఇంకా పడిపోయే అవకాశాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ వర్గాలు. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ పేల్చిన బాంబుతో బంగారం పడిపోతోంది. చైనాతో ఇన్నిరోజులు కయ్యం పెట్టుకున్న ట్రంప్.. ఇప్పుడు ఆ దేశంపై సుంకాలు ఎక్కువ రోజులు కొనసాగవని సంకేతాలు ఇవ్వడంతో బంగారం తగ్గుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. కొన్ని రోజులుగా పెరుగుతూపోయిన బంగారం మార్కెట్లో.. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదికూడా ఒక కారణమే. గతేడాది ట్రంప్ గెలిచిన దగ్గర్నుంచి పెరుగుతూపోయిన బంగారం ధర.. ఇప్పుడు తగ్గడానికి ముఖ్యమైన కారణమేంటంటే.. అనేక దేశాల్లో యుద్ధవాతావరణ పరిస్థితులు తొలగిపోయి.. సాధారణ పరిస్థితులు నెలకొనడం కూడా ఇంకో కారణం.
భారత్‌లో అయితే.. దంతేరాస్‌కు ముందు బంగారం ధరలు పెరగడం కామనే. ఆతర్వాత పడిపోవడం కూడా సర్వసాధారణం. ఇది కూడా ఓ కారణమే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. తక్కువ సమయంలో ఎక్కువగా పెరుగుతూ పోవడం వల్ల మార్కెట్లో కరెక్షన్ రావడం కూడా సహజమే. ఇప్పుడు జరుగుతోంది కూడా అదే అంటున్నారు. ట్రంప్ త్వరలోనే భారత్‌పైనా సుంకాలు తగ్గించే యోచనలో ఉన్నారు. చైనాపైనా తగ్గిస్తామని ఇప్పటికే చెప్పారు. మిగిలిన దేశాలపైనా సుంకాలు తగ్గిస్తే.. బంగారంతోపాటు.. వెండి, ఇతక కమొడిటీల ధరలు దిగిరానున్నాయి. అదే జరిగితే.. బంగారం మరోసారి లక్ష దిగువకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..