
బంగారం ధరలు గత రెండేళ్ల కాలంలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలు చేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. కనీసం బంగారం షాపుల వైపు కూడా వెళ్లడం లేదు. పెళ్లిళ్ల సమయంలో అవసరమైతే తప్పితే పెరిగిన ధరలతో గోల్డ్ కొనుగోలు చేసేవారు సగానికి సగం తగ్గిపోయారు. కొనేవారు కూడా తక్కువ మోతాదులో కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో బంగారం కొనాలంటే సులభమైన మార్గం ఏది..? తక్కువ ధరకు ఎలా కొనాలి? బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే మార్గాలేంటి? అనే విషయాలు తెలుసుకుందాం.
మీరు పెట్టుబడి రూపంలో బంగారం కొనుగోలు చేయాలంటే ఫిజికల్ బంగారం కొంటే నష్టపోతారు. భౌతిక బంగారంపై జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, ట్యాక్సులు వంటివి ఉంటాయి. దీంతో అసలు ధర కంటే ఎక్కువ భారం మీపై పడుతుంది. మీరు తిరిగి అమ్మాలనుకున్నప్పుడు మేకింగ్, జీఎస్టీ వంటివి నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో పెట్టుబడి అవసరాల కోసం బంగారం కొనాలంటే.. ఫిజికల్ బంగారం కంటే గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇవి అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. వీటిల్లో పెట్టుబడి పెడితే జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, డీలర్ ప్రిమియం వంటివి ఉండదు. ఇక నిల్వ ఖర్చు వంటివి ఉండవు. మీరు తిరిగి అమ్మాలనుకున్నప్పుడు వాస్తవ మార్కెట్ ధర లభిస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్లు మరో ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గం చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్బీఐ ఈ బాండ్లను విడుదల చేస్తుంది. ఇవి కూడా అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా చెప్పవచ్చు. అంతేకాకుండా మీరు పెట్టుబడి పెట్టే బంగారంపై అదనంగా 2.5 శాతం వార్షిక వడ్డీ కూడా పొందవచ్చు. వీటి కొనుగోలుపై జీఎస్టీ, తయారీ ఛార్జీలు, నిల్వ ఖర్చు లాంటివి ఉండవు. 8 సంవత్సరాల వరకు ఉంచుకుంటే మూలధన లాభాలపై ట్యాక్స్ ఉండదు.
మీరు భౌతిక బంగారం కొనాలంటే గోల్డ్ కాయిన్స్, కడ్డీలు కొనండి. వీటికి మార్కెట్ ధర కంటే కేవలం 1 నుంచ 3 శాతం వరకు మాత్రమే మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. ఆభరణాలతో పోలిస్తే వీటిల్లో నష్టం తక్కువగా ఉంటుంది. ఇక తయారీ ఛార్జీలు అనేవి అన్ని వ్యాపారుల దగ్గర ఒకేలా ఉండవు. దీంతో రెండు, మూడు షాపుల్లో పోల్చి చూడండి. మేకింగ్ ఛార్జీలు తగ్గింమచమని అడగండి. ఇక పాత డిజైన్లపై తయారీ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. వాటిని పరిశీలించండి. ఇక కొంతమంది వ్యాపారులు పాత బంగారం మార్పిడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పాత నగలు తీసుకొచ్చి తయారీ ఛార్జీల్లో మాఫీ పొంది కొత్త కొనుగోలుకు క్రెడిట్ పొందవచ్చు. ఇక గ్రాము లేదా 2 గ్రాముల్లో లభించే నాణెలను క్రమం తప్పకుండా కొనండి. దీని వల్ల క్రమమక్రంగా మీ వద్ద బంగారం పెరుగుతుంది.ల