
భారతీయులకు బంగారానికి విడదీయలేని బంధం ఉంది. ప్రపంచంలో భారతీయులు వినియోగించినంత బంగారాన్ని మరే దేశస్థులూ వాడరేమో. పుట్టిన పిల్లల దగ్గరినుంచి.. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్ల వరకు బంగారం లేనిదే ఏ ఒక్క శుభకార్యాన్ని చేయరు. బంగారాన్ని సాక్షాత్తూ లక్ష్మీ దేవితో పోలుస్తారు. ఏటా టన్నుల కొద్దీ భారత్ కు బంగారం దిగుమతి అవుతుంటుంది. దేశం ఆర్థికంగా కుదేలైనా, మరేదైనా పెను సవాలు ఎదుర్కోవలసి వచ్చినా ఈ బంగారం నిల్వలే కాపాడతాయని ప్రభుత్వాలు కూడా నమ్ముతాయి. అందుకే భారత్ ఇటీవల ఏకంగా 100 టన్నుల బంగారాన్నిఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి లాభాలు గడించేవారు కొందరైతే.. దీనిని ప్రెస్టేజ్ ఇష్యూగా భావించేవారు మరికొందరు. బంగారం ధరలు రూ. 80 వేలు దాటేసినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. అంతలా మన దేశంలో గోల్డ్ కి డిమాండ్ ఉంది. కానీ, షాకింగ్ విషయం ఏమిటంటే బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. గోల్డ నిల్వల్లో కూడా అగ్రరాజ్యమే టాప్ లో నిలిచింది.
2024, సెప్టెంబర్ నాటికి అమెరికా వద్ద మొత్తం 8,133.5 టన్నుల బంగారం నిల్వ ఉంది. అంతేకాదు ప్రతి ఏటా ఈ నిల్వలను పెంచుకుంటూనే ఉంది. ఇలా పెద్ద మొత్తంలో బంగారం నిల్వ చేసి మరింత తిరుగులేని శక్తిగా అమెరికా రాజ్యం ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఆ తర్వాత రెండో స్థానంలో జర్మనీ ఉంది. ప్రస్తుతం జర్మనీ వద్ద మొత్తంగా 3,351.53 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇక మూడో స్థానానికి వస్తే ఇటలీ ఉంది. ఇటలీ వద్ద ప్రస్తుత లెక్కల ప్రకారం 2,451.84 టన్నుల బంగారం ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత నాలుగో స్థానంలో ఫ్రాన్స్ ఉండగా.. ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ వద్ద మొత్తం 2,436.94 టన్నుల బంగారం ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో చైనా.. 2,264.63 టన్నులను స్టోర్ చేసుకుంది. స్విట్జర్లాండ్ 1,039.94.. తైవాన్, చైనా.. 422.69 టన్నులు, పోలాండ్.. 419.70 టన్నులు బంగారాన్ని నిల్వ చేసుకున్నాయి. ఏడో స్థానంలో ఉన్న భారత్ 853.63 టన్నుల బంగారంతో మధ్యస్థంగా ఉంది.
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఉన్న పింగ్జియాంగ్ కౌంటీలో దాదాపు 78 బిలియన్ యూరోలు విలువైన ఒక ముఖ్యమైన బంగారు గనిని గుర్తించారు. ఈ గనిలో సుమారు 1,000 టన్నుల బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజంగా ఇక్కడ అంచనాలకు అనుగుణంగా బంగారం లభిస్తే చైనా బంగారు పరిశ్రమతో ప్రపంచ మైనింగ్ రంగం ఓ మైలు రాయిగా మారుతుంది. చైనాలోని వాంగులో బయటపడిన ఈ బంగారు గని ఆ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ స్థాయి నిల్వ సాధ్యమైతే హునాన్ ప్రావిన్స్ ప్రపంచ బంగారు మార్కెట్లో ప్రధాన పాత్రధారిగా ఎదగవచ్చు . ఈ ఆవిష్కరణకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు మైనింగ్ కార్యకలాపాలకు మించి విస్తరించి ఉన్నాయి మైనింగ్, శుద్ధి, రవాణా, అనుబంధ పరిశ్రమలలో వేలాది కొత్త ఉద్యోగాల సృష్టి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.