Gautam Adani Birthday: 60వ పుట్టినరోజున రూ.60వేల కోట్లను విరాళంగా ప్రకటించిన అపర కుబేరుడు.. సామాజిక సేవా కార్యక్రమాల కోసం ..

|

Jun 24, 2022 | 8:26 AM

Gautam Adani: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ (Gautam Adani) నేడు 60వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. 1962 జూన్‌ 24న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయన జన్మించారు. తన వ్యాపార దక్షతతో అంచెలంచెలుగా రాణించారు..

Gautam Adani Birthday: 60వ పుట్టినరోజున రూ.60వేల కోట్లను విరాళంగా ప్రకటించిన అపర కుబేరుడు.. సామాజిక సేవా కార్యక్రమాల కోసం ..
Gautam Adani
Follow us on

Gautam Adani: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ (Gautam Adani) నేడు 60వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. 1962 జూన్‌ 24న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయన జన్మించారు. తన వ్యాపార దక్షతతో అంచెలంచెలుగా రాణించారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరిగా గుర్తింపుతెచ్చుకున్నారు. 1988లో కమొడిటీ ట్రేడింగ్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమక్రమంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలో బొగ్గు, మైనింగ్‌, లాజిస్టిక్స్‌, విద్యుదుత్పత్తి, విద్యుత్‌ పంపిణీ, గ్రీన్‌ ఎనర్జీ, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లు, సిమెంట్‌ తదితర రంగాల్లో అదానీ గ్రూప్‌ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందుకు తగ్గట్లే అదానీ సంపద కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదే ఈ అపర కుబేరుడి సంపద 15 బిలియన్‌ డాలర్లు పెరగడం విశేషం. ఈక్రమంలోనే బ్లూమ్‌బెర్గ్‌ నివేదించిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు గౌతమ్ అదానీ.

60వేల కోట్ల విరాళం..

ఇవి కూడా చదవండి

కాగా తన 60వ పుట్టిన రోజును పురస్కరించుకుని అదానీ, ఆయన కుటుంబ సభ్యులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు రూ.60వేల కోట్లతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అదానీ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లోని దాతృత్వ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. నేటితో అదానీకి 60వ ఏళ్లు పూర్తవుతుండడం, అలాగే గౌతమ్‌ అదానీ తండ్రి శాంతిలాల్‌ అదానీ శత జయంతి కూడా ఇదే ఏడాది కావడంతో ఈ దాతృత్వ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అదానీ కుటుంబం ప్రకటించింది. ‘మా నాన్నగారి 100వ జయంతి, నా 60వ పుట్టినరోజు సందర్భంగా, అదానీ కుటుంబం భారతదేశం అంతటా హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్‌ అండ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ కోసం రూ. 60,000 కోట్లను విరాళంగా ఇస్తుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ ఫండ్‌ను ఖర్చుచేస్తారు. ఆత్మనిర్భర్ భారత్ కి పునాది వేసేలా అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి ప్రయత్నాలపై అదానీ ఫౌండేషన్‌ దృష్టి సారిస్తోంది. సవాళ్లను పరిష్కరించడం ద్వారా మన భవిష్యత్ శ్రామిక శక్తి సామర్థ్యాన్ని, పోటీతత్వాన్ని గణనీయంగా పెంచేందుకు కృషిచేస్తోంది’ అని అదానీ గ్రూప్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. కాగా ఈ సేవా కార్యక్రమాల కోసం మూడు కమిటీలు నియమిస్తామన్నారు గౌతమ్‌ అదానీ. ఈ మొత్తాన్ని ఏయే రూపాల్లో ఖర్చు చేయాలనేది ఆయా కమిటీలు నిర్ణయిస్తాయని, తన కుటుంబ సభ్యులు కమిటీల్లో సహాయక సభ్యులుగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

అతిపెద్ద విరాళాలలో ఒకటిగా..

కాగా ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం అదానీ నికర ఆస్తుల విలువ దాదాపు 95 బిలియన్ డాలర్లు. ఈక్రమంలో రూ.60వేల కోట్లను సామాజిక సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చిన ఆయన మార్క్‌ జుకర్‌బర్గ్‌, వారెన్‌ బఫెట్‌, అజీజ్‌ ప్రేమ్‌జీ, రతన్‌టాటాల సరసన నిలిచారు. వ్యాపార రంగంలో దిగ్గజాలుగా గుర్తింపు పొందిన వీరు తమ సంపదలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నారు. ఇక దేశీయంగా దాతృత్వంలో అదానీ కంటే అజీమ్‌ ప్రేమ్‌జీ, రతన్‌టాటాలు ముందు వరుసలో ఉన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..