
గణేశ్ నవరాత్రుల సందడి మొదలయ్యే వేళ సైబర్ నేరగాళ్లు కూడా తమ మోసాలకు పదును పెడుతున్నారు. వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి, మండపాల అలంకరణ వస్తువులు, లడ్డూ ప్రసాదం, ఆన్‌లైన్ విరాళాల పేరుతో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. మార్కెట్ ధరలతో పోలిస్తే ఐదారు రెట్లు తక్కువకే వస్తువులను హోం డెలివరీ చేస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు పెడుతున్నారు. వీటిని నమ్మి సంప్రదించిన పలువురు ఇప్పటికే నగదు కోల్పోయినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
నగరాల్లో గణేశ్ ఉత్సవాలను భారీగా నిర్వహిస్తారు. వేడుకలకు కొన్ని వారాల ముందే విగ్రహాల కొనుగోలు, మండపాల ఏర్పాటు, అలంకరణలు, విరాళాల సేకరణ ప్రారంభమవుతుంది. ఇదే అవకాశంగా భావిస్తున్న సైబర్ ముఠాలు ఆన్‌లైన్ వేదికలను వేదికగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. ఆన్‌లైన్‌లో గణపతి విగ్రహాలు, డెకరేషన్ సామగ్రి లేదా పూజా వస్తువుల కోసం సెర్చ్ చేసినప్పుడు తమ ఫోన్ నంబర్లు కనిపించేలా నకిలీ ప్రకటనలను రూపొందిస్తున్నారు. తక్కువ ధరలకు వస్తువులు ఇస్తామని చెప్పి మొదట బుకింగ్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత డెలివరీకి ముందు మరికొంత డబ్బు చెల్లించాలని, డెలివరీ బాయ్‌కు చార్జీలు, గ్యారంటీ ఫీజు తదితర పేర్లతో అదనపు నగదు వసూలు చేస్తున్నారు.
ప్రముఖ గణేశ్ ఉత్సవ కమిటీల పేర్లను ఉపయోగించి ఆన్‌లైన్‌లో విరాళాలు కోరడం మరో మోసపూరిత విధానంగా మారింది. ఉత్సవ కమిటీల అధికారిక ఖాతాలకు బదులుగా వ్యక్తిగత యూపీఐ నంబర్లు లేదా అనుమానాస్పద లింకులను పంపించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. స్థానికంగా నిర్వహించే వేడుకలకు విరాళం ఇవ్వాలనుకునేవారు సాధ్యమైనంత వరకు నిర్వాహకులను నేరుగా సంప్రదించాలని సూచిస్తున్నారు.
గణేశ్ నవరాత్రుల సందర్భంగా లాటరీలు, లక్కీ డ్రాలు, ప్రత్యేక బహుమతుల పేరుతో వచ్చే లింకులపై కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని లింకులను క్లిక్ చేయడం, ఓటీపీలు లేదా బ్యాంకింగ్ వివరాలు పంచుకోవడం వల్ల ఖాతాల్లోని డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు గుర్తింపు ఉన్న, నమ్మకమైన వేదికలనే ఉపయోగించాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద ప్రకటనలను చూసి వెంటనే డబ్బు చెల్లించకుండా వివరాలను ధృవీకరించుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.